న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
నిలువునా ముంచుతున్న మైక్రోఫైనాన్స్‌ సంస్థలు

మెదక్: నర్సీపట్నం పరిసరాల్లోని మైదాన, గిరిజన గ్రామాల్లో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు తిష్టవేసి అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. గ్రామాల్లోకి వీరి వ్యాపారాన్ని విస్తరిస్తూ గ్రామీణులను జలగల్లా పీల్చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లె కుటుంబాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నామని చెప్పి ముంచేస్తున్నారు. గ్రామాల్లో వడ్డీ వ్యాపారాలపై నిషేధం ఉన్నా అవేమీపట్టనట్లు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అతి తక్కువ వడ్డీ అంటూ అమయాక ప్రజలను బుట్టలో వేసుకుంటూ రుణాలందజేస్తున్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించలేక ప్రజలు వడ్డీ వ్యాపారుల వద్ద మరింత అప్పుచేసి ఫైనాన్స్‌ చెల్లిస్తున్నారు.

తక్కువ కాలంలో సునాయాసంగా లక్షలు సంపాదించవచ్చనే ఆలోచనతో అనేక సంస్థలు పట్టణాల్లో ముఖ్య కార్యాలయాలను ఏర్పాటుచేసి గ్రామాల్లో శాఖలను ప్రారంభించి వారి కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అపరాద రుసుం పేరుతో కూడా అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. అక్రమ ఫైనాన్స్‌ సంస్థలపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు, పోలీసులు ఆయా సంస్థలపై కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహిళలు మైక్రో ఫైనాన్స్‌ సంస్థల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పావలావడ్డీ రుణాలను ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో పథకం నీరుగారిపోతోంది. పావలా వడ్డీ రుణాలపై అంతగా ప్రచారం లేకపోవటం, బ్యాంకర్లు అనేక నిబంధనలు విధించడం, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్ప రుణాలు సక్రమంగా అందకపోవడంతో అప్పుకోసం మహిళలు ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

దీన్ని అదునుగా భావిస్తున్న ఫైనాన్స్‌ సంస్థలు రూపాయి పావలా వడ్డీ అని చెప్పి రుణాలు అందజేస్తున్నాయి. తర్వాత అధికవడ్డీ వసూలు చేస్తున్నాయి. రూ.10 వేలు అప్పు ఇచ్చి వడ్డీతో కలిపి వారానికి రూ.225 చొప్పున 50 వారాలు వసూలు చేస్తున్నారు. రూ.18 వేలు రుణం తీసుకున్న వారి నుంచి వారానికి రూ.405 చొప్పున 50 వారాలు వసూలు చేస్తారు. వాయిదాలు చెల్లిస్తున్న క్రమంలో వడ్డీరేటును తగ్గిస్తూ రావాలి. కాని చివరి వారం వరకూ ఒకే రకంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. దీంతో పాటు బీమా పేరిట వారానికి రూ.20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పు తీరినా బీమాను వసూలు చేస్తూనే ఉంటున్నారు. అప్పు ఇచ్చే ముందు ఫీజు పేరిట రూ.120, డాక్యుమెంటేషన్‌ పేరిట రూ.500 వసూలు చేస్తారు. ఇది రుణం తీసుకున్న ప్రతిసారీ వసూలు చేస్తున్నారు. కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు 10 శాతం డిపాజిట్‌ను ముందుగానే వసూలు చేస్తున్నారు. తలోరకంగా పేద ప్రజలు దోచుకుంటున్నారు. అప్పు తెచ్చి అభివృద్ధి చెందుదామనుకొంటున్న వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. డ్వాక్రాగ్రూపులకు గాలం వేస్తున్నారు.

తక్కువ వడ్డీకి రుణాలందజేస్తామని, సభ్యులు అనారోగ్యానికి గురైతే ఆర్థిక సహాయం అందజేస్తామని, తమ సంస్థ ద్వారా ఉచితంగా వైద్య సేవలు, కుటుంబంలో ఎవరైనా లేదా సభ్యుడే మరణిస్తే తీసుకున్న అప్పును మాఫీ చేస్తామని, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడంతో పాటు లక్ష రూపాయల వరకూ బీమా చెల్లిస్తామని, తిరిగి సంస్థ ద్వారా అప్పు ఇస్తామని చెబుతూ ఫైనాన్స్‌ సంస్థలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మహిళలు అప్పు తీసుకున్న తర్వాత అసలు కథ మొదలవుతోంది. ప్రతి వారమూ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడంతో పాటు మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలి. అప్పు వాయిదాను ఇంకొకరితో పంపించరాదు. రెండు వారాలు చూసి మీటింగ్‌లకు రాని వారిని ఇంటికి పంపిస్తారు.

మీటింగుకు రానివారు లోను ఎందుకు తీసుకునారంటూ దబాయించి అప్పంతా వడ్డీతో సహ తక్షణమే చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఒకటి, రెండు వాయిదాలు చెల్లించకపోతే ఆ గ్రూపులో ఉన్న తోటి మహిళలచే సొమ్మును వసూలు చేస్తారు. ఎన్ని ఆశలు చూపించి రుణాలిస్తారో తర్వాత అంతగా ముంచేస్తారు. అధికారులు ఈ సంస్థలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.