న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
స్వైన్‌ ప్ల్యూపై అనుక్షణం అప్రమత్తం

విజయనగరం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): జిల్లా కలక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కేంద్ర ఆసుపత్రిలోని స్వైన్‌ ప్ల్యూ, ఎమర్జెన్సీ, కేజువాల్టీ, బర్న్స్‌, బ్లడ్‌ బ్యాంకు, ఆరోగ్య శ్రీ వార్డులను, ఎయిడ్స్‌ సలహా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పలు వార్డులలో రోగులతో మాట్లాడి, వారికి అందిస్తున్న వైద్య సౌకర్యాల వివరాలను అడిగితెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కేసులు ఎన్ని వచ్చాయని అడుగగా ఈ దినం 10 కేసులు వచ్చాయని వైద్యాధికారి తెలిపారు. తరువాత పే వార్డులను తనిఖీ చేసారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆసుత్రుల అభివృద్ది కమిటీ సమావేశం గతంలో ఎప్పుడు నిర్వహించారు, ఎన్నాళ్లకి ఒకసారి నిర్వహిస్తున్నారని ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డా. ఈశ్వరప్రసాదుని ప్రశ్నించారు. ప్రతీ మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహించవలసి వున్నదని అయితే గత సమావేశం నిర్వహించి ఆరు మాసాలు దాటిందని సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా నిర్వహించాలని, తదుపరి సమావేశానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా అమలు పరచాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి మంజూరైన మొత్తం సిబ్బంది, ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల సమన్వయాధికారి డా.కె.ఎన్‌.మూర్తి, సూపరింటెండెంట్‌ ఈశ్వర్‌ప్రసాద్‌, స్వైన్‌ ప్ల్యూ నోడల్‌ ఆఫీసర్‌ డా. ఉషశ్రీ, బ్లడ్‌ బ్యాంకు వైద్యలు డా. శ్రీనివాస్‌, యితర వైద్యలు సిబ్బంది పాల్గొన్నారు.