|
|
స్వైన్ ప్ల్యూపై విస్తృత ప్రచారం అవసరం
విజయనగరం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): ఆసుపత్రులకు వచ్చిన రోగులందరికీ స్వైన్ ప్ల్యూపై ముద్రించిన కరపత్రాలను అందించడం ద్వారా వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని విజయనగరం జిల్లా కలక్టరు యం. వీరబ్రహ్మయ్య తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో స్వైన్ ప్ల్యూపై జరిగిన ఒక్కరోజు వర్కుషాపును ప్రారంభించారు. స్వైన్ ప్ల్యూపై తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుగులో ముద్రించి ప్రజలందరికీ అందేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారికి సూచించారు. విజయనగరంలో మూడు స్వైన్ ప్ల్యూ కేసులు నమోదైన సందర్భంగా స్వైన్ ప్ల్యూ వ్యాధిపట్ల ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయని, విస్తృత అవగాహన కల్పించడం ద్వారా సందేహాలను నివృత్తి చేయాలని చెప్పారు. వ్యాధి ల క్షణాలున్న రోగులను వెంటనే కేంద్ర ఆసుపత్రుల్లో చేర్పించాలని తెలిపారు. వైద్యులందరూ వర్కుషాపులో స్వైన్ ప్ల్యూపై అవగాహన కల్పించుకొని కొత్తకేసులు లేకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ వ్యాధికి ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నామని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని, దానివలన జిల్లా యంత్రాంగం సిద్దంగా వుంటుందని తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. వ్యాధి పట్ల జాగ్రత్తగా వుండాలని ప్రతీ రోజు ముఖ్యమైనదేనని, వైద్యులతో యిలాంటి వర్కుషాపు మరొకటి నిర్వహించాలని తెలిపారు. ఈ వర్కుషాపులో స్వైన్ ప్ల్యూ వ్యాధిపై పల్మనాలజీ శాఖ, అసోషియేట్ ప్రోఫెసర్ డా. ప్రేమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమానికి జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా. రామారావు స్వాగతం పలికారు. స్వైన్ ప్ల్యూ నోడల్ ఆఫీసరు డా. దేవి, రీజనల్ డైరెక్టరు డా. సోమరాజు, మిమ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు పాల్గొన్నారు.
|
|
|