|
|
త్రీజీ సెల్ ద్వారా పోలింగ్ పరిశీలన : సిఇవో
హైదరాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): ఎన్నికల అధికారులకు త్రిజి సెల్ ఫోన్‌లు అందచేసి ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని సమగ్రంగా ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ఉప ఎన్నికల ఎర్పాట్లపై జిల్లా కలెక్టర్లు , ఎస్.పి.లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ను సిఇవో నిర్వహించారు. ఈ సందర్బంగా సిఇవో మాట్లాడుతూ, ఉప ఎన్నికల నిర్వహణకు అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా బి.ఎస్.ఎన్.ఎల్. త్రిజి సెల్ ఫోన్ సౌకర్యాన్ని జోనల్ అధికారులకు కల్పించనున్నట్లు తెలిపారు. ఎ పోలింగ్ కేంద్రం వద్దనైనా సమస్య తలెత్తితే ఎన్నికల సంఘం అధికారులు ఆయా జోనల్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి త్రిజి సెల్ ఫోన్ ద్వారా స్వయంగా పరిస్థితిని తెలుసుకుంటారని అన్నారు. అదే విధంగా, ప్రతి రెండు గంటలకు ఒక సారి ప్రతి పోలింగ్ కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ శాతాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి ఎస్‌ఎంఎస్ పంపిస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల ఎజెంట్ల జాబితాను ఈ నెల 24వ తేది సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు అందచేయాలని సిఇవో స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో కేవలం గుర్తింపు పొందిన పార్టీల ఎజెంట్లకు మాత్రమే స్థానం కల్పిస్తున్నట్లు సుబ్బారావు తెలియచేశారు. 25వ తేది 5 గంటల వరకు ఉప ఎన్నికలు ప్రచార పర్వం ముగుస్తుందని అన్నారు. ప్రచారానికి కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున ప్రచారం ఉదృతంగా జరిగి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంత ప్రశాంతం-కలెక్టర్ ఉప ఎన్నికల సందర్బంగా జిల్లా పాలనా యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతొ ఇప్పటి వరకు ఎ విధమైన అవకతవకలను జరగకుండా నివారించగలిగామని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకై ఎర్పాటు చేసిన ఐదు బృందాలు ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని వీడియో గ్రఫీ చేస్తోందని అన్నారు. క్రమం తప్పకుండా అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయాన్ని నమోదు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పశ్చిమ ఉపఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో బందోబస్తు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఎస్.పి. షానవాజ్ ఖాసీం తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఐజి జితేందర్ , డిఆర్‌ఓ శేషాద్రి , వరంగల్లు పశ్చిమ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
|
|
|