న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
'రాజు' మినహా మిగతా వారికి బెయిలు

హైదరాబాద్‌, జులై 20 (ఫీచర్స్ ఇండియా): సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజు మినహా మిగిలిన నిందితులందరికీ హైకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయిదుగురు నిందితులు బెయిల్‌పై విడుదల అయ్యారు. దేశీయ ఐటీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన సత్యం కుంభకోణంలో రామలింగరాజు సహా అతని కుటుంబ సభ్యులు అక్రమ మార్గాల్లో 2,743 కోట్ల రూపాయలను జేబులోకి మళ్లించుకున్న విషయం వెలుగుచూసిన విషయం తెలిసిందే. పద్దు పుస్తకాల్లో అక్రమాలు జరిగాయని వెల్లడిస్తూ అప్పటి సత్యం కంప్యూటర్స్‌లో కీలక స్థానంలో ఉన్న ఉద్యోగులందరికి కుంభకోణంలో సంబంధమున్నట్లుగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సీబీసీ గతంలో పేర్కొంది. ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా బోర్డులో ఉన్న ప్రముఖులు రబ్బర్ స్టాంపులుగా వ్యవహరించారని సిబిఐ వ్యాఖ్యానించింది. బోర్డు సమావేశాల కాలంలో వీరు ఎలాంటి అసమ్మతిని తెలియజేయలేదని రికార్డులు స్పష్టంగా తెలుపుతున్నాయని నిఘా సంస్థ పేర్కొంది. డిప్యుటేషన్‌పై సిబిఐలో పనిచేస్తున్న ఆర్‌బిఐ జనరల్ మేనేజర్ జెఎల్ నేగి సత్యం కుంభకోణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను గతంలోనే వెల్లడించారు. కుంభకోణంలో సత్యం కంప్యూటర్స్‌కు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఆడిటర్లు కూడా పాలు పంచుకున్నారని తమ పరిశోధనలో తేలిందని నేగి చెప్పారు. మోసపూరిత అమ్మకాలకు పాల్పడటంతో పాటు మాన్యువల్ ఎంట్రీలు చేసినట్లు సిబిఐ పరిశోధనలో స్పష్టమైందని, దీనినే తొలి సాక్ష్యంగా తీసుకున్నట్లు నేగి పేర్కొన్నారు. తర్వాతి దశలో ఇన్వాయిస్‌లను ఎవరు సృష్టించారనేది గుర్తించినట్లు తెలిపారు. కేవలం నిందితులు ఆఫీస్‌లోకి వచ్చినపుడు ఉపయోగించిన స్వైప్ మెషిన్ల డాటాను తీసుకున్నామని, అందులో కొంతమంది సాధారణంగా మూడు నెలలకు లేదా నెలకు ఒకసారి రాత్రి సమయాల్లో మాత్రమే కార్యాలయాలకు వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే వారు దొంగ ఇన్వాయిస్‌లను సృష్టించారని నేగి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసు హైదరాబాద్ కోర్టులో నడుస్తోంది. చార్జ్‌షీట్‌ను దాఖలు చేయటానికి 25 మంది ఆఫీసర్ల బృందంతో పాటు 40 ఇన్వెస్టిగేటర్ల బృందం పనిచేసింది. ఈ కేసులో ఇప్పటికే సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశామని, త్వరలో మరో చార్జ్ షీట్‌ను దాఖలు చేయనున్నట్లు నేగి వెల్లడించారు. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రాపర్టీస్ అటాచ్‌మెంట్‌కు సంబంధించి పనిచేస్తోందని, క్రిమినల్ లా ఆర్డినెన్స్ చట్టం కింద ఒక్కొక్కటి మూడు కోట్ల రూపాయల విలువైన 100 ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించినట్లు చెప్పారు.
నేగి వెల్లడించిన కీలక అంశాలు
+1,230 కోట్ల రూపాయల బకాయిలను తగ్గించి చూపించారు. 490 కోట్ల రూపాయల అప్పును హెచ్చించి చూపించారు.
+ 1991లో 18.78 శాతం ఉన్న ప్రమోటర్ల వాటా 2008 ఆఖరు నాటికి 2.18 శాతానికి తగ్గింది. బినామి లావాదేవీలు బ్రోకర్ల ద్వారా షేర్లను అమ్ముకుని 767.73 కోట్ల రూపాయలను ప్రమోటర్లు వెనకేసుకున్నారు.
+1999 నుంచి 2008 మధ్య కాలంలో 3,454.9 కోట్ల రూపాయల విలు వైన 935 ఆస్తులను రామలింగరాజు కుటుంబం కూడగట్టింది. వీటి వైశాల్యం 5757.30 ఎకరాలు.
+ 327 కంపెనీలను సృష్టించి అడ్డగోలు లెక్కలను చూపించారు. ఈ కంపె నీల ద్వారానే భూబాగోతం జరిగింది.
+ పద్దు పుస్తకాల్లో ఎక్కడా కనిపించని 1,230 కోట్ల రూపాయలను ఈ కంపెనీల నుంచే సత్యం తీసుకుంది.
+ 2003నుంచి 2008 మధ్య 7,561బోగస్ ఇన్వాయిస్‌లను సృష్టించారు.
+ మోబిటెల్, సెల్‌నెట్, ఇ కేర్, సినోని,నార్త్ సీ, ఆటోటెక్, హార్‌గ్రీవ్స్‌ల పేరుతో అడ్రస్ లేని కంపెనీలను సృష్టించి ప్రాజెక్టులను చేపట్టారు.
+ మార్కెట్ ధర 500 రూపాయలుగా ఉన్న సమయంలో స్టాక్ ఆప్షన్స్ కింద డైరెక్టర్లకు రెండు రూపాయలకే షేర్లను అందించారు.
+ 2007-08, 2008-09 కాలంలో ప్రమోటర్లు 27.08 కోట్ల రూపాయల డివిడెండ్‌ను తీసుకున్నారు.