|
|
'మహా' జులుం!
తెదేపా నేతలపై విరుచుకుపడ్డ మహారాష్ట్ర పోలీసులు
ధర్మాబాద్‌లో మళ్లీ ఉద్రిక్తత
ధర్మాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): జుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ నేతలపై మహారాష్ట్ర పోలీసులు మంగళవారం రెచ్చిపోయారు. ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా ఇతర ప్రజాప్రతినిధులపై విజృంభించారు. టీడీపీ నేతలు మంగళవారం ఉదమం అల్పాహారం తీసుకుంటుండగా పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు సహా, టీడీపీ ఎమ్మెల్యేలపై వీరు దౌర్జన్యానికి పాల్పడ్డారు. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు పంపించివేశారు.
చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేల సెలైన్లు పీకివేసి వారిని బస్సుల్లోకి తరలించేందుకు యత్నించారు. వారి చర్యలను వ్యతిరేకించినవారిని బూటుకాళ్లతో తన్నుకుంటూ, అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఈడ్చుకు వెళ్లారు. ఈ తోపులాటలో చంద్రబాబునాయుడు కిందపడ్డారు. నేతల చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కుని నేలకేసి కొట్టి గూండాల్లా ప్రవర్తించారు.
మహిళా ఎమ్మెల్యేలపైనా దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కంటతడి పెట్టారు. వైద్య సహాయం అందించేందుకు వెళ్లిన 108 సిబ్బంది కూడా పోలీసుల తోపులాటలో గాయపడ్డారు. నేషనల్, ప్రాంతీయ ఛానల్స్ ప్రతినిధులపై కూడా కాకీలు తమ ప్రతాపం చూపారు. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు సహా టీడీపీ నేతలను ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నారు. గాయపడిన పలువురు ఎమ్మెల్యేలు తమ గోడును ఫోన్ ద్వారా మీడియాకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో ధర్మాబాద్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు సహా ఇతర నేతలను ఔరంగాబాద్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు అన్న విధంగా తెదేపా నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పకుండా బస్సులోకి ఎక్కాలంటూ నేతలను ఐటీఐ నుంచి బయటకు నెట్టివేశారు. తెదేపా నేతలపై పోలీసులు చేయి చేసుకోవడంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల తోపులాటలో గంప గోవర్థన్ కాలికి గాయమయ్యింది. సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యేల గన్‌మెన్లను వేరేచోటికి తరలించారు. నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించి తీసుకెళ్తున్నారు. ధర్మాబాద్‌లో పరిస్థితి భీతావహంగా ఉందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ 'ఫీచర్స్ ఇండియా'కు తెలిపారు. ప్రజాప్రతినిధులపట్ల ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల వాహనాలతోపాటు, రాష్ట్ర వాహనాలను మహారాష్ట్ర పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు.
ధర్మాబాద్‌లో నేతల నిర్బంధం నేపథ్యంలో మహారాష్ట్ర తీరుపై తెదేపా బృందం గవర్నర్‌ను కలిసింది. బాబ్లీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రం బాబ్లీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదిలావుండగా ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో నిర్బంధంలో ఉన్న తెదేపా నేతలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏడుగురు శాసనసభ్యుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వీరి ఆరోగ్యంపై ప్రభుత్వం స్పందించి నాలుగు 108 వాహనాలు, వైద్యులను పంపింది. కానీ, మహారాష్ట్ర పోలీసులు తెల్లవారుజామున బిద్రెల్లి సమీపంలో ఈ వైద్య బృందాన్ని అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రాల్లో తెదేపా రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది.
ధర్మాబాద్‌లో తెదేపా నేతలపై లాఠీఛార్జీకి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పలు జిల్లాల్లో రాస్తారోకోలు చేపట్టారు. బషీర్‌బాగ్‌లో కిరోసిన్ పోసుకొని తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కూకట్‌పల్లిలో ఆరు బస్సుల అద్దాలు పగులగొట్టారు. వాహనాల టైర్లలో ఆందోళనకారులు గాలి తీశారు. అద్దంకిలో బస్సుపై కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సుల అద్దాలను ధ్వసం చేశారు. రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. విజయవాడ ఆటోనగర్ చెక్‌పోస్టు వద్ద తెదేపా రాస్తారోకో చేపట్టింది. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టీడీపీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. నిలిపి ఉన్న బస్సుల అద్దాలు పగులగొట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆర్టీసీ బస్సులపైకి కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విజయవాడ, గుంటూరు, నల్గొండలో టీడీపీ ఆందోళనకు దిగింది.
|
|
|