|
|
అమీన్, జైట్లీలను తొలగించాలి: మోడీ
ముంబయి, జులై 17 (ఫీచర్స్ ఇండియా): బహిష్కరణకు గురైన ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీని విచారించడానికి ఏర్పాటైన బీసీసీఐ క్రమశిక్షణ సంఘం (డిసిప్లీనరీ కమిటీ) తొలిసారిగా సమావేశమైంది. అందరూ ఊహించినట్లే విదేశీ పర్యటనలో ఉన్న లలిత్ మోడీ క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరుకాలేకపోయారు. మోడీ తరపున అతని లాయరు మెహ్‌మూద్ అబెది క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తన వాదనలను వినిపించారు. క్రమశిక్షణ సంఘం ముందు కూడా మోడి తన పట్టును వీడలేదు. కమిటీ సభ్యులైన ఐపీఎల్ తాత్కాలిక చైర్మన్ చిరాయు అమీన్, బీజెపీ జాతీయ నాయకుడు అరుణ్ జైట్లీలు తనపట్ల పక్షపాతంగా వ్వవహరించే అవకాశముందని మోడీ తరపు లాయరు కమిటీ ముందు వాదించారు.
అందుకే వారిద్దరినీ కమిటీ నుంచి తొలగించాలని ఆయన క్రమశిక్ష ణ సంఘాన్ని అభ్యర్థించారు. ''మా సమావేశం చాలా బాగా జరిగింది. కమిటీ సభ్యులు చిరాయు అమీన్, అరుణ్ జైట్లీలను తొలగించాలని మేము కమిటీని కోరాం. కమిటీ సభ్యులు తమ అభ్యర్థనను పరిశీలిస్తామని చెప్పారు'' అని మోడి లాయరు మెహ్‌మూద్ అబెదీ కమిటీ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నా రు. ఈ నెల 27న ఢిల్లీ కమిటీ మళ్లీ సమావేశమౌతుందని కూడా అబెదీ వెల్లడించారు. కమిటీ సమావేశంలో తమ మధ్య చర్చకు వచ్చిన ఇతర అంశాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. క్రమశిక్షణ సంఘంలో చర్చకు వచ్చే అంశాలన్నింటినీ మీడియాకు వెల్లడించరాదని తాము, కమిటీ ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకున్నామని అబెదీ తెలిపారు. కమిటీ సమావేశంలోని ముఖ్యాంశాల్ని బీసీసీఐ తన వెబ్‌సైట్లో పెడుతుందని కూడా ఆయన వెల్లడించా రు. బాంబే హైకోర్టు ఆదేశానుసారం తాము కమిటీ ముందుకు హాజరై సభ్యుల తొలగింపు అంశాన్ని ఎత్తుతామని అబెదీ అన్నారు.
|
|
|