న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
చైనా పద్ధతిలో శుద్ధీకరణ పనులు

ముంబై, జులై 17 (ఫీచర్స్ ఇండియా): మిఠీనది శుద్ధీకరణ పనుల కోసం చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఈ పనుల కోసం అమెరికా శాస్త్రజ్ఞుల సాయం తీసుకుంది. కాని అది అనుకున్నంత మేర ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాక ఆ పద్దతి చాలా ఖర్చుతో కూడున్నది కావడంతో ఇక చైనా సాంకేతిక పరిజ్ఞానంతో మిఠీనది నీటిని శుద్ధీచేయాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. నెల రోజుల కాల వ్యవధిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ రీజియన్‌లోని ఈ-బ్లాక్‌ పరిసరాల్లో కిలోమీటరు మేర నీరు పరిశుద్ధంగా దర్శనమివ్వనుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్‌ రత్నాకర్‌ గైక్వాడ్‌ చెప్పారు. పనులు పూర్తికాగానే ఇక్కడ బోటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి శుద్ధీకరణ చేసే యంత్రాలను తయారుచేశాడు. కాని ఆయన చైనాలో పెటెంట్‌ పొందారు. పైగా ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో అ«థారిటీకి గిట్టుబాటు కూడా అవుతుంది. ప్రారంభంలో ఈ యంత్రాల ద్వారా ఒక కిలోమీటర్‌ మేర శుద్ధీకరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం ఆరు కిలోమీటర్ల గల ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ.ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఖర్చు కానున్నాయి. పారదర్శకతతో కూడిన టెండర్ల ద్వారా ఈ పనులు పూర్తిచేయనున్నారు. ఈ యంత్రాల పని వేగవంతం వల్ల కేవలం 24 గంటల్లోనే నీరు పరిశుభ్రంగా మారుతుంది. ఇలా శుభ్రంగా మారిన నీటిని పరిక్షించే బాధ్యతలు నిరీ సంస్థకు అప్పగించనున్నారు. ప్రస్తుతం మిఠీనదికి ఇరువైపుల గార్బియన్‌ వాల్‌ నిర్మించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే నదికి ఇరుపక్క ప్రాంతాలు సురక్షితం కానున్నాయి. అయితే మిఠీనది పరిసరాల్లో శోభీకరణ పనులు 2012 వరకు పూర్తవుతాయని గైక్వాడ్‌ చెప్పారు.