న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
సీనియర్‌ సిటిజన్స్‌ సమస్యలపై సమీక్ష

ఏలూరు, జులై 17 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలోని వృద్ధాశ్రమాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్‌ రెవెన్యూ డివిజినల్‌ అధికారులను ఆదేశించారు. సీనియర్‌ సిటిజన్స్‌ సమస్యలపై ఆర్‌డిఓలతో కలెక్టరు సమీక్షించారు. పిల్లల నిరాదరణకు గురై ఎంతోమంది వృద్ధులు సమాజంలో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారని అటువంటి వృద్ధుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని కలెక్టరు చెప్పారు. జిల్లాలోని వృద్ధ ఆశ్రమాల వివరాలను సేకరించి అందులోని వృద్ధుల అనారోగ్య పరిస్ధితులను తెలుసుకుని ప్రతీ నెలా 104 వాహనం ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించడమే కాకుండా అవసరమైన మందులను ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ద్వారా చేయాలని కలెక్టరు ఆర్‌డిఓలను కోరారు. సమాజంలో ఆస్తులు ఉండి పిల్లల నిరాదరణకు గురవుతున్న వృద్ధులు ఎంతో మంది ఉన్నారని, అటువంటి వారి విషయంలో రెవెన్యూ అధికారులు వృద్ధుల సంరక్షణా చట్టం కింద వారి వారసుల నుండి తగిన పరిహారం అందేలా తీర్పులు చెప్పాలని కలెక్టరు ఆర్‌డిఓ లను కోరారు. ఈ తీర్పులు పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని పెంచే విధంగా ఉండాలే తప్ప వారిని విడదీసే విధంగా తీర్పులు ఉండకూడదని సూచించారు. జిల్లాలో వృద్ధులకు సంబంధించిన 53 సమస్యలు అందాయని, వాటిలో 29 విచారణ జరిపి తగు తీర్పులు ఇవ్వడం జరిగిందని కలెక్టరు చెప్పారు. వృద్ధుల సమస్యల విషయంలో అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికపై పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని వాణీ ప్రసాద్‌ కోరారు. జిల్లాలో చేపల చెరువుల త్రవ్వకాన్ని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, గతంలో ఉన్న 18 జిఓ ప్రకారం చేపల చెరువులు త్రవ్వడానికి ధరఖాస్తు చేసిన రెండు నెలల్లోగా అధికారులు అనుమతి ఇవ్వకపోతే అనుమతించినట్లుగా భావించి చెరువులు త్రవ్వుకునే అవకాశం ఉండేదని, అయితే ప్రభుత్వం క్రొత్తగా జీఓ నెంబరు 24 జారీచేసిందని, దీనిప్రకారం చేపల చెరువుల త్రవ్వకాలపై ధరఖాస్తు ఇచ్చిన వాటిపై మండల, జిల్లా కమిటీలలో తగు ఆమోదం పొందాల్సి ఉంటుందని కలెక్టరు చెప్పారు. జిల్లాలో వ్యవసాయానికి అనువుగా లేని భూములను మాత్రమే చేపల చెరువులుగా మార్చడానికి అవకాశం ఉందని, అదీ కూడా పర్యావరణానికి విఘాతం కలిగించని, ప్రజలకు ఎ టువంటి ఇబ్బంది లేనివిధంగా ఉంటే అటువంటి ప్రతిపాదనలను మండల కమిటీలలో ఆమోదించాల్సి ఉందని, అవి జిల్లా కమిటీలలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని, ఇంకా అవసరమైతే రాష్ట్ర కమిటీలకు సిఫార్స్‌ చేయాల్సి ఉంటుందని కలెక్టరు చెప్పారు. ఈ విషయాన్ని పరిగణన లోనికి తీసుకుని ఎ టువంటి అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా చూడాలని కలెక్టరు ఆర్‌ డిఓ లను ఆదేశించారు. జిల్లాలో బడిబాట అమలుతీరు, బాలకార్మికులతో పనులు చేయించకుండా చూడడం, మొదలైన విషయాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలని కలెక్టరు చెప్పారు. జిల్లాలో పారశుద్ధ్య పరిస్ధితులు మెరుగుపరచాలని, ఎ వరైనా బహిరంగ మలవిసర్జన చేస్తే అటువంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రేషన్‌ నిలుపుదల చేయాలని వాణీ ప్రసాద్‌ ఆదేశించారు.
ఏలూరు ఆర్‌ డిఒ కు కలెక్టరు ప్రశంస
పిల్లల నిరాదరణకు గురైన ఒక వృద్ధ మహిళకు జీవనభృతి అందించేలా తీర్పు చెప్పిన ఏలూరు ఆర్‌డిఓ వి. ఆర్‌. కె. ప్రభాకరరావును కలెక్టరు వాణీప్రసాద్ ప్రశంసించారు. ఈ తీర్పు బహుశా రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రప్రథమమని, ప్రతీ ఆర్‌డిఓ ప్రభాకరరావును ఆదర్శంగా తీసుకుని వృద్ధుల శ్రేయస్సును చూసే విధంగా తీర్పులు వెలువరించాలని కలెక్టరు చెప్పారు. ప్రేగు బంధం ఒక మాతృమూర్తికి న్యాయం చేయలేకపోయినా ప్రభుత్వ చట్టాలను ఖచ్చితంగా అమలు చేసే ఒక అధికారి ఆమెకు ఆసరా కల్పించారు. కన్న కొడుకు, కోడలు నిరాదరణకు గురైన ఆ మాతృమూర్తికి పట్టెడన్నం పెట్టేలా ఆదేశాలు జారీ చేసిన ఏలూరు ఆర్‌డిఓ వి.ఆర్‌.కె. ప్రభాకరరావు పనితీరు ప్రశంసలను చూరగొంది. 75 సంవత్సరాల వృద్ధురాలు మల్లంపల్లి నాగరత్నం తన జీవితాన్ని సాఫిగా గడపడానికి ఆయనిచ్చిన ఆదేశాలు మార్గదర్శకంగా నిలాచాయి. జిల్లా కలెక్టరు ఏ. వాణీ ప్రసాద్‌ ఈ కేసులో బాధితురాలికి చట్టబద్ధంగా ఆర్‌డిఓ ప్రభాకరరావు న్యాయంచేసిన తీరును మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిరాదరణకు గురి చేసేవారికి ఆయన ఆదేశాలు కనువిప్పుగా మారాయి. ఆర్‌డిఓ ప్రభాకరరావు ఆదేశాలు దేశంలోనే ప్రతీ ఒక్కరిలో ఆలోచనలను రేకిత్తించి అధికారులకు ఆదర్శంగా మారుతున్నాయి. ఈ కేసు వివరాలలోకి వెళితే... బాధితురాలు మల్లంపల్లి నాగరత్నం. ఈమె భర్త నాగేశ్వరరావు చనిపోయారు. 75 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్యంలోనూ ఆమె కుటుంబ సభ్యుల చేదోడు వాదోడు లేక నానా కష్టాలను అనుభవిస్తోంది. ఈమె ఏకైక కుమారుడు సత్యనారాయణ. ఇతనికి నాగరత్నం 26 ఎ కరాల భూమిని ఇచ్చింది. లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం, టి. నర్సాపురం మండలం మఠంగూడెం గ్రామాలలో అతను ఈ భూములను సాగుచేసుకుంటూ భార్యా పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఇతను, ఇతని భార్య నాగరత్నం ఆలనాపాలనా సరిగ్గా చూడకపోవడంతో మూడేళ్ల క్రితమే ఆమె బాధతో చింతలపూడి గ్రామానికి వెళ్లిపోయింది. అక్కడ నెలకు 450 రూపాయలు అద్దె క్రింద చెల్లిస్తూ ఒక ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. తన కుమారుడు, కోడలు తనను పట్టించుకోవడం లేదని ఆమె గత ఏడాది అక్టోబరు 26వ తేదీన జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. ఈమె బాధలను గ్రహించిన ఆయన వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరుకు ఫిర్యాదును పంపారు. ఈ కమిటీకి వెంకటేశ్వరరావు మెంబరు కన్వీనరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై కమిటీ స్పందించి నాగరత్నానికి, ఆమె కుమారుడు సత్యనారాయణకు కేసు విచారణ నిమిత్తం నోటీసులు పంపింది. అయితే సదరు సత్యనారాయణ తాను సాగు చేస్తున్న 26 ఎ కరాల భూమిలో 12 ఎ కరాలు వ్యవసాయానికి అనువుగా లేదని, మిగిలిన 14 ఎ కరాలు కౌలుకు ఇచ్చానని పేర్కొన్నాడు. దీనిపై ఆదాయం అంతంతమాత్రమేనని తెలివిగా నిస్సహాయతను వ్యక్తం చేసాడు. దాంతో ఈ కేసులో బాధితురాలు నాగరత్నానికి, వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్టు 2007 సెక్షన్‌ 9(1) ప్రకారం భోజనంతోపాటు బట్టలు, మందులు, ఇంటి అద్దె క్రింద నెలకు 2 వేల 500 రూపాయలు చొప్పున సత్యనారాయణ విధిగా చెల్లించాలని ఆర్‌ డిఓ ప్రభాకరరావు ఆదేశాలు జారీ చేసారు. నాగరత్నం తాను ఏ తేదీనైతే కమిటీకి ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచే ఈ చెల్లింపులు అమలులోకి వచ్చేలా ఆయన జారీ చేసిన ఆదేశాలు సంచలనం కలిగించాయి. బాధితురాలు నాగరత్నం తనకు మేలు చేసిన ఆర్‌డిఓ ప్రభాకరరావుకు కన్నీటి పర్యంతం అవుతూ కృతజ్ఞతలు చెప్పుకుంది. సమావేశంలో జేసి పి. వెంకట రామిరెడ్డి, ఆర్‌డిఓలు వి.ఆర్‌.కె. ప్రభాకరరావు, నాగేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, రమణా రెడ్డి, జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి అత్యుతరామయ్య, తదితరులు పాల్గొన్నారు.