|
|
నిజమైన బాధితులకు న్యాయం జరగాలి
ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై పశ్చిమ కలెక్టర్ సమీక్ష
ఏలూరు, జులై 17 (ఫీచర్స్ ఇండియా): ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద వంద తప్పుడు ఫిర్యాదులు పట్టించుకోక పోయినా పర్యాలేదు కానీ, ఒక్క నిజమైన బాధితుడికి అన్యాయం చేస్తే సహించబోనని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎ. వాణీ ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి సంబంధించి జస్టిస్ పున్నయ్య కమీషన్ అనేక సిఫార్సులు చేసిందన్నారు. వాటితో పాటు జిల్లా స్ధాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఉన్నాయన్నారు. ఇంత విస్తృతంగా వారి సంక్షేమానికి ప్రాథాన్యతనిస్తున్నా ఇంకా యస్‌సి, యస్‌టిలపై అత్యాచారాలు, వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిజమైన బాధితులకు న్యాయం చేయకపోతే కోనేరు రంగారావు కమిటీ ఎందుకు, విజిలెన్స్ కమిటీ ఎందుకని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. సమాజంలో బలహీనుడికి అన్యాయం జరిగినప్పుడు అధికారులు అండగా ఉండకపోతే ప్రభుత్వ వ్యవస్ధపై నమ్మకం ఎలా ఉంటుందని కలెక్టరు ప్రశ్నించారు. టి. నర్సాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యస్‌సి రైతు ముక్కొండ పెద గంగరాజు పొలంలోని పంటను 2009లో సమతపూడి బాల సూర్యనారాయణరాజు అనే భూస్వామి ధ్వంసం చేసి గంగరాజు పొలాన్ని తన ఎస్టేట్‌లో కలుపుకుని దౌర్జన్యం చేసిన కేసును ఎవరూ పట్టించుకోలేదని కలెక్టరు చెప్పారు. ఈ కేసుపై వాస్తవాలను నివేదించాలని ఏలూరు ఆర్ డిఓ వి.ఆర్.కె. ప్రభాకరరావును ఆదేశించానని సమగ్ర విచారణ చేసి బాధితుని తరపున పోలీస్ స్టేషన్‌లో ఆర్‌డిఓ ఫిర్యాదు చేయడం పట్ల కలెక్టరు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇటువంటి విషయాల్లో అధికారులు నిజమైన బాధితుల పక్షాన ముఖ్యంగా ఏ అండా లేని నిరుపేదలకు అండగా ఉండాలని కలెక్టరు కోరారు. సమాజంలో నిజమైన బాధితులకు రక్షణ కల్పించి భవిష్యత్తులో బలహీనులపై బలవంతులు దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని ప్రజలంతా గ్రహించేలా అధికారుల నిర్ణయాలు ఉండాలని వాణీ ప్రసాద్ చెప్పారు. న్యాయపరమైన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్‌పి రవివర్మ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ స్టేషన్‌లకు అందే ప్రతీ ఫిర్యాదును తొలుత రిజిష్టరు చేయాలని అందరికీ ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జిల్లాలో చాలా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు వెంటనే స్పందించాలని, ఈ విషయంలో ఎవరినీ కొట్టమనడం లేదు, కాల్చమనడం లేదు, కేసు పెట్టి కోర్టుకు అప్పగించమని చెబుతున్నామని, కావున సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రవివర్మ ఆదేశించారు. జిల్లా కలెక్టరు చెప్పినట్లు నిజమైన బాధితునికి అన్యాయం జరగకూడదని, ఆ దిశగా పోలీసులు తమ బాధ్యతలను గుర్తించి సత్వర న్యాయానికి ప్రాథమిక స్ధాయిలోనే తగు చర్యలు తీసుకోవాలని రవివర్మ కోరారు. కమిటీ సభ్యులు నంబూరి బోస్ బాబు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే బెయిలు పొంది బయటకు వస్తున్నారని, దీనివల్ల చట్టం యెక్క పటుత్వం పోయినట్లేనని చెప్పారు. దళితుడైన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టరును దూషించిన విషయంలో సాక్ష్యాత్తు జెసి అతనిపై ఫిర్యాదు చేస్తే వెంటనే బెయిలుపై నిందితుడు బయటకు రావడం చూస్తుంటే సమాజంలో దళితులు ఎలా బతకాలని బోస్ ప్రశ్నించారు. కమిటీ సభ్యులు బురదగుంట క్రాంతికుమార్ మాట్లాడుతూ మండల స్ధాయిలో కూడా ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేసి నిర్ణీత కాలవ్యవధిలో సమావేశాలు నిర్వహించి ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించేలా చూడాలని కోరారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై కమిటీ సభ్యులు నేతల రమేష్ బాబు పలు అంశాలను ప్రస్తావించగా వాటిలో న్యాయపరమైన వాటిపై విచారణ జరిపించి బాధితులకు తగు న్యాయం చేస్తామని కలెక్టరు వాణీ ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో జేసి పి. వెంకట రామిరెడ్డి, అడిషినల్ జేసి మిరియాల వెంకట శేషగిరి బాబు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ఆర్. మల్లిఖార్జునరావు, ఆర్‌డిఓలు వి.ఆర్.కె.ప్రభాకరరావు, నాగేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, రమణా రెడ్డి, డియస్‌పిలు సాయి శేఖర్, జానకీ షర్మిల, రవివర్మ, కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, పొలిమేర హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
|
|
|