|
|
చదువులో ముందుండకపోతే జీవితంలోనూ...
అనంతపురం, జులై 17 (ఫీచర్స్ ఇండియా): విద్యార్ధులు చదువుపై శ్రద్ధ పెట్టి తమ ప్రతిభను నిరూపించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.జనార్ధనరెడ్డి సూచించారు. తరగతులకు తరచూ గౌర్హాజరుకావడం వల్ల చదవులో వెనుకబడిపోవడమే కాకుండా భవిష్యత్తులో తమ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టసాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ సందేహాల నివృత్తికి కూడా వీలు ఉండదని హితవుపలికారు. అనంతపురం పాతవూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కస్తూరిబా బాలికల ఉన్నతపాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి విద్యార్థుల ప్రతిభా పాఠవాలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాలలోని ద్వితీయ సంవత్సరం సిఇసి విద్యార్థులను పలు ప్రశ్నలడిగి వారి ప్రతిభా పాఠవాలను పరిశీలించారు. విద్యార్థులు వారి తరగతిలోని సరాసరి మార్కులను కూడా చెప్పకపొవడం విచారకరమన్నారు. ఆంగ్ల పాఠ్యాంశంలో మొదటి పాఠంలోని పదాలకు అర్థాలు కూడా తెలుసుకోలేని స్థితిలొ ఇంటర్ విద్యార్థులు వుండడం సరైన పద్దతికాదన్నారు. డిక్షనరీని కూడా చూడని విద్యార్థులు ఇంటర్‌లో వుండడం అధ్యాపకులు గుర్తించకపోవడం సరైన విధానం కాదన్నారు. 90 శాతం మార్కులు సాధిసైనే విద్యార్థులకు భవిష్యత్తు వుంటుందని వారు ఉపాధిపొందుటకు అవకాశాలు వుంటాయని అంతకు తక్కువ శాతం మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి పొందలేరన్నారు. కావున అధ్యాపకులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. అసైన్‌మెంట్లు రాయించడంతో పాటు పదాలకు అర్థాలు తెలియజేయాలని సూచించారు. విద్యార్థుల గైర్హాజరు శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. కాలేజీకి వస్తున్నాం, వెళ్తున్నాం అనే విధానంతో కాకుండా మా భవిష్యత్తు కోసం విద్యనభ్యసిస్తున్నాం అనే భావన విద్యార్థులలో కలిగించాలని హితవుపలికారు. తల్లిదండ్రుల కోసం కాలేజీకి వస్తున్నాం అనే రీతిలో నేడు విద్యార్థులుండడం భాధాకరమన్నారు. అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకుని భోదించాలన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశములు అర్థంకానట్లయితే వారు తరగతులకు హజరుకావడం వృథా అవుతుందన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రతి అధ్యాపకుడు కృషి జరపాలన్నారు. అనంతరం కలెక్టర్ స్థానిక కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల సందర్శించి పదవ తరగతి విద్యార్థుల ప్రతిభా పాఠాలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులు గత సంవత్సరంలలో తొమ్మిది, ఎనిమిది, ఏడవ తరగతులలో నిర్విహించిన వార్షిక పరీక్షల మార్కులను తెలుసుకోకపోవడం ఉపాధ్యాయులు తెలుపకపోవడం విచారించదగ్గవిషయమన్నారు. విద్యార్థులు వారు రాసిన పరీక్షలలో వారు పొందిన మార్కులు తెలుసుకోలేకపోవడం చేత వారి స్థాయిని పెంపొందించుకోలేకపోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. పరీక్షలంటే పదవ తరగతి పరీక్ష ప్రధానం కాదని, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పరీక్షలు ప్రధానంగా భావించాలన్నారు. విద్యార్థులు వారి పాఠ్యాంశాలలోని సందేహలను అధ్యాపకులను అడుగుదాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే భావన కలిగివుండాలన్నారు. తరగతి గదులలోనూ, ప్రైవేట్లలో ఒకే విధానంతో ఉపాధ్యాయులు భోదించడం వల్ల పదవ తరగతే ప్రతి ఒక్కరూ ప్రధానమని తలంచుచున్నారన్నారు. ఫలితాలకన్నా ప్రమాణాలతో కూడిన విద్యను పొందడమే విద్యార్థులకు ప్రధానమన్నారు. గైర్హా జరు శాతం తగ్గించడం, డ్రాప్ అవుట్ శాతం తగ్గించడం ప్రతి విద్యార్థికి చక్కగా చదడవం, రాయడం, నేర్పించాలన్నారు. విద్యార్థులతో కమిటీలను ఏర్పాటుచేసి వారిలో సామాజిక బాధ్యతను అలవరచాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధ్యాపకులతో, ఉపాధ్యాయులతో సమావేశమై వివిధ బోధనాపద్దతులపై సూచనలు, సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుని తదితరులు పాల్గొన్నారు.
|
|
|