|
|
అనంతలో 5.47 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు
అనంతపురం, జులై 17 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈనెల 15వ తేదీనాటికి 5 లక్షల 47 వేల 560 హెక్టార్లలో వేరుశనగ విత్తనాన్ని రైతులు వేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాధికారులు వేరుశనగ పంటకు, ఇతర పంటలకు ఏదైనా సమస్యలు ఉత్పన్నమవుతాయెమోనని తెలుసుకోవడానికి ప్రయత్నించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.జనార్థన రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వ్యవసాయాశాఖాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జిల్లాలో 3.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని, వ్యవసాయాధికారుల సూచనల మేరకు జూలై 15వ తేదీ వరకు వేరుశనగ విత్తనాన్ని రైతులు వేసుకోవడానికి మంచి అవకాశం వున్నందున ఈనెల 15 నాటికి 5 లక్షల 47 వేల 560 హెక్టార్లలో వేరుశనగ విత్తనాన్ని వేశారని తెలిపారు. మిగిలిన విస్తీర్ణంలో 22 వేల 815 హెక్టార్లలో కంది పంటను రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాధికారులు రైతులకు అనునిత్యం అందుబాటులో వుండాలన్నారు. ఆదర్శ రైతులున్నప్పటికీ పంటలకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సత్వరమే నివారణ చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు సంసిద్ధంగా వుండాలన్నారు. రైతులకు వ్యవసాయాశాఖాధికారులతో వ్యవసాయానికి సంబంధించి చేరవలసిన అంశాలు ఏదో ఒక ప్రక్రియ ద్వారా చేరాలన్నారు. రైతులకు, వ్యవసాయశాఖాధికారులకు మధ్య ఏలాంటి సమన్వయం కొరవడరాదని సూచించారు. ఎరువులు, వ్యవసాయ పురుగు మందులు సకాలంలో అందించాలన్నారు. గ్రామంలోని సర్వే నెంబరు ఆధారంగా ఏ పంటను రైతు సాగు చేస్తున్న వివరాలను వ్యవసాయాధికారులు సేకరించాలని, భవిష్యత్తులో ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాలలోనూ, మండలాలలోనూ జరుగుతున్న గ్రామ సమైఖ్య, మండల సమైఖ్య సమావేశ వేదికలను వ్యవసాయాధికారులు సద్వినియోగం చేసుకొని వారి శాఖకు సంబంధించిన అంశాలను వివరించాలని సూచించారు.
|
|
|