|
|
అనధికార ఎన్నికల ప్రచారంపై చట్ట ప్రకారం చర్యలు
ఆదిలాబాద్, జులై 17 (ఫీచర్స్ ఇండియా): సినిమా హాళ్లలో, కేబుల్ నెట్‌వర్కుల్లో ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం, స్క్రోలింగ్‌లు నిర్వహించినట్లయితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. తన ఛాంబర్‌లో సినిమా హాళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సిర్పూర్, చెన్నూర్, మంచిర్యాల శాసనసభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగుచున్నందున అభ్యర్ధులు వారి పార్టీలకు సంబంధించిన ప్రకటనలు, స్క్రోలింగ్‌లు ప్రదర్శించకూడదని, ప్రకటనలు గాని, చిన్న నిడివి గల క్లిప్పింగులు గాని, కేబుల్ నెట్‌వర్క్ లలో స్క్రోలింగ్ లు గాని ప్రదర్శించాలనుకుంటే నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా రిటర్నింగ్ అధికారులకు ప్రదర్శన లేదా ప్రకటన లేదా స్క్రోలింగ్‌కు మూడు రోజుల ముందుగా దరఖాస్తుతో పాటు ప్రకటన లేదా స్క్రోలింగ్‌కు సంబంధించిన వివరాలు లేదా మెటీరియల్స్‌ను, సి.డి.లను సమర్పించాలని, ఆయా దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ప్రసారం చేయవలసిన ప్రకటన లేదా స్క్రోలింగ్ చేయదలచిన వివరాలు సంబంధిత రిటర్నింగ్ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు పరిశీలించి, అందులో ఏలాంటి ఆక్షేపణలు లేనట్లయితే జిల్లా ఎన్నికల అధికారికి అనుమతి కై సమర్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లా కమిటీలో అట్టి ధరఖాస్తును పరిశీలించి ప్రదర్శానార్ధం అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన లేదా అనుమతి లేకుండా ప్రకటనలు ప్రదర్శించడం లేదా స్క్రోలింగ్‌లు వేస్తే ఆయా యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవల్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రీళ్లను థియేటర్‌లలో ప్రదర్శించకుండా ఆయా రీళ్లను జిల్లా పౌర సంబంధాల అధికారికి వాపసు పంపించాలని కలెక్టర్ అన్నారు. ఎన్నికల మోడల్ కోడ్‌కు లోబడి పనులు చేపట్టాలని, ఉద్దేశపూర్వకంగా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, చర్చావేదికలలోని చర్చలు వ్యక్తిగతంగా, జాతి, కుల, మతతత్వాలు ఉండరాదని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, డిఆర్వో చంద్రశేఖర్, జిల్లా పౌరసంబంధాల అధికారి అష్రఫ్ ఖాన్, ధియోటర్లు, కేబుల్ నెట్ వర్క్ ల యజమానులు పాల్గొన్నారు.
|
|
|