|
|
రక్తదానంలో కె.యు. ఎన్.ఎస్.ఎస్. ముందంజ
వరంగల్, జులై 16 (ఫీచర్స్ ఇండియా): రక్తదానంలో భాగంగా గత విద్యా సంవత్సరంలో 18,304 యూనిట్లను రక్తదానం చేయడం ద్వారా కాకతీయ విశ్వ విద్యాలయం ఎన్.ఎస్.ఎస్. విభాగం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని కాకతీయ విశ్వ విద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ లింగమూర్తి అన్నారు. కాకతీయ విశ్వ విద్యాలయం జాతీయ సేవా పథకం అడ్వయిజరీ కమిటి సమావేశం వైస్. చాన్స్‌లర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా ప్రొఫెసర్ లింగమూర్తి మాట్లాడుతూ, కాకతీయ ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు రక్తదానం చేయడంతో ఎంజిఎం బ్లడ్ బ్యాంకు వరుసగా ఆరవ సారి రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని అన్నారు. 2010 జనవరి మాసంలో 8 వేల వాలంటీర్లతో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక కార్యక్రమాల క్రింద విశ్వ విద్యాలయ పరిధిలోని 4 జిల్లాలో 19, 196 మొక్కలను వన మహోత్సవంలో భాగంగా నాటడం జరిగిందని వి.సి. వివరించారు. వీటితో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు దాదాపు 500 మందితో సమ్మక్క, సారలమ్మ జాతరలో విస్త్రత సేవలందించడం జరిగిందని ఫ్రొ. లింగమూర్తి తెలిపారు. ర్యాగింగ్ లేని విశ్వ విద్యాలయం రాష్ట్రంలో కేవలం కాకతీయ విశ్వ విద్యాలయమేనని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి మెగా ఎన్.ఎస్.ఎస్. వర్క్ క్యాంపు నిర్వహించాలని ప్రతి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో యువజనోత్సవాలను నిర్వహించాలని ఈ సందర్బంగా తీర్మానించారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారులకు ఈ అక్టోబర్ మాసంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని వైస్ చాన్స్‌లర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఫ్రొఫెసర్ సదానందం, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎ. శ్రీనివాస్, ఎన్.ఎస్.ఎస్. రాష్ట్ర అసిస్టెంట్ ప్రోగ్రాం అడ్వయిజర్ రాజేంద్రన్, రాష్ట్ర సమన్వయాధికారి జి. భాస్కర్ రావు, డాక్టర్ దామోదర్ , డిపిఆర్‌ఓ. కె.వెంకటరమణ, ప్రోగ్రాం అధికారులు సత్యనారాయణ, సుహసిని, బాలగంగాధర్ తదితరులు హజరయ్యారు.
|
|
|