న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
చంద్రబాబు బృందానికి 'మహా' బురిడీ!

ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్తామని చెప్పి ధర్మాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
పర్యటనకు అనుమతి లేని కారణంగానే అదుపులోకి తీసుకున్నామని ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణ
ఇలాంటి కుట్రలతో తమ లక్ష్యాన్ని అడ్డుకోలేరంటూ హెచ్చరిక
బాబ్లీ అక్రమాలను ప్రధానికి వివరిస్తానంటూ ప్రకటన
బాబు ఆందోళనలో అర్ధంలేదన్న వీహెచ్
కేవలం అది రాజకీయ యాత్రేనంటూ పొన్నం ప్రభాకర్ విమర్శ
హైదరాబాద్, జులై 16 (ఫీచర్స్ ఇండియా): బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మహారాష్ట్ర పోలీసులు తప్పుదోవపట్టించారు. ప్రాజెక్టు వద్దకు తీసుకువెళతామని చెప్పి నేరుగా పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లిన నేతలను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుతో పాటు పది మంది నేతలను పోలీసు వాహనంలో ధర్మాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి తీసుకువెళ్లి అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్ట్‌ అయినవారిలో మాజీ మంత్రులు టి.దేవేంద్రగౌడ్‌, వేణుగోపాల చారి, పార్లమెంట్ సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, నామా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ విషయం తెలిసి సరిహద్దులలో ఆందోళనకు దిగిన టిడిపి నేతలను, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి ధర్మాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 76 మంది టిడిపి నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాబ్లీకి చేరడానికి ముందే వారిని అరెస్టు చేసినట్టు నాందేడ్ ఎస్.పి. సందీప్‌కర్ణి ప్రకటించడం గమనార్హం. చంద్రబాబు అరెస్టుతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దు మార్గాన్ని మహారాష్ట్ర పోలీసులు మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ బాబ్లీ బస్సు యాత్ర చేపట్టిన నేపథ్యంలో యాత్రను అడ్డుకునేందుకు మహారాష్ట్ర సర్కార్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియాను కూడా పోలీసులు సరిహద్దు వద్దే అడ్డుకున్నారు. కాగా బాబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు మహారాష్ట్ర ఐటీ శారదా ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. సరిహద్దు దాటితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులోని ధర్మాబాద్‌ వద్ద టీడీపీ నేతలంతా బస్సు దిగి బైఠాయించారు. బాబ్లీని ఆపాలని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బాబ్లీకి సమీపం వరకు ఆ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అటువైపు బాబ్లీ సంఘర్షణ సమితి నేతలు బైఠాయించి అనుకూల నినాదాలు చేస్తున్నారు. ఆరు వర్గాల నినాదాలతో సరిహద్దు ప్రాంతం మారుమోగుతోంది. ''న్యాయం కోసం వచ్చాం, తప్ప చట్టం ఉల్లంఘనకు కాదు. చట్టాన్ని గౌరవించే మనుషులుగా బాబ్లీవల్ల మనకు జరుగుతున్న అన్యాయం గురించి నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే ప్రాజెక్టులను స్వయంగా చూడడానికి వచ్చాం. అంతదూరం నుంచి వస్తే ఇంతమంది పోలీసులను ఇక్కడ మొహరింపజేశారు. బాబ్లీని చూసే వెళ్తాం'' అని చంద్రబాబునాయుడు అన్నారు. అక్రమ కట్టడాల బండారం బయటపడుతుందనే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీని చూడనివ్వడంలేదని విమర్శించారు. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదంటూ ముందుకే వెళ్లడానికి చంద్రబాబు నాయుడు యత్నించడంతో మహారాష్ట్ర పోలీసులు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో బాబ్లీ సమీపంలో చాలా ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. బాబ్లీ సందర్శనకు రమ్మంటూ వ్యూహాత్మకంగా చంద్రబాబునాయుడుతో సహా టీడీపీ నేతలను అరెస్టు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ పరిసరాల్లో కర్ఫ్యూ విధించింది. టీడీపీ నేతలెవరూ ఆందోళనలు, బైఠాయింపులు చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు. పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు అక్కడే మీడియా మాట్లాడుతూ ఏం తప్పు చేశామని రానివ్వడంలేదని ఆగ్రహంగా ప్రశ్నించారు. మహారాష్ట్రకు రావడానికి ఎవ్వరికీ పాస్‌పోర్టులు, వీసాలు అక్కరలేదని, మరి మమ్మల్ని ఎందుకు నిలువరిస్తున్నారని అయన ప్రశ్నించారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు, మీరేమైనా పాస్‌పోర్టులు, వీసాలతో ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా యు.పి.ఎ. అధ్యక్షురాలు సోనియా గాని, ప్రధాని మన్‌మోహన్ గాని ఎందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణాను ఎడారిగా మార్చనున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుని తీరతామని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. చట్టాన్ని, ట్రైబ్యునల్‌ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. బాబ్లీ వద్ద ప్రస్తుత పరిస్థితులు చూసి ఈనెల 23న ప్రధానికి నివేదిస్తామన్నారు. బాబ్లీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని మనకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలని అన్నారు. బాబ్లీకి సమీపంలో టీడీపీ నేతలతో సహా బైఠాయించిన ఆయన అక్కడ ప్రసంగించారు. తాము 120 మంది వస్తే తమను అడ్డుకునేందుకు వందలమంది వచ్చారన్నారు. తాము అహింసామార్గంలో వెళతామని దయచేసి అడ్డుకోవద్దని కోరారు. తాము ప్రాజెక్టు వద్దకు వెళితే అక్రమ కట్టడాల బండారం బయటపడుతుందనే వెళ్లనివ్వటం లేదన్నారు. మహారాష్ట్రలోకి వెళ్లేందుకు కూడా వీసా, పాస్‌పోర్ట్‌ కావాలా అని ప్రశ్నించారు. తాము రెండు సార్లు ఢిల్లీ వెళ్లి బాబ్లీపై నిరసన తెలిపినా కేంద్రం స్పందించలేదన్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీతో భేటీ అయ్యారు. అనంతరం మొయిలీ మీడియాతో మాట్లాడుతూ బాబ్లీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. దీనిపై ఈనెల 23న కాంగ్రెస్‌ ప్రతినిధులు ప్రధానిని లఖిలపక్షంతో సహా వెళ్లి కలుస్తారన్నారు. జగన్‌ ఓదార్పుయాత్ర వ్యక్తిగతమని ఆయనే చెప్పారని అన్నారు. ఉప ఎన్నికలపై కూడా చర్చ జరిగిందన్నారు. మొయిలీతో భేటీలో సీఎంతో పాటు, హోం మంత్రి, కేవీపీ రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నా... తెదేపా అధినేత చంద్రబాబు దీనిపై అనవసర ఆందోళనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. తన హయాంలో బాబ్లీ గురించి ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబుకు బాబ్లీపై ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. సమస్య పరిష్కారానికి ఈనెల 23న అఖిలపక్ష సమావేశానికి ప్రధాని అంగీకరించినా... ఆందోళన చేయడంలో అర్థం లేదన్నారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని వీహెచ్‌ సూచించారు. రాజకీయ స్వార్థంతోనే బాబ్లీ సమస్యను టీడీపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఈనెల 23ను బాబ్లీ సమస్యపై ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ కావాలనే బాబ్లీ యాత్ర చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా కృషి చేస్తున్నామని పొన్నం అన్నారు. ప్రధానమంత్రితో జరిగే అలపక్ష సమావేశంలో ఐక్యంగా గొంతు వినిపించేందుకు టీడీపీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.