న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
శివసాగర్‌ పనుల్లో జాప్యంపై హోం మంత్రి ఆగ్రహం

పద్దతి మార్చుకోవాలంటూ అధికారులకు హితవు
ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తిచేయాలంటూ ఆదేశం
రంగారెడ్డి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణపు పనుల్లో జాప్యం జరుగుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, లేనట్లయితే అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ పనితీరుపై శుక్రవారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. గత రెండు సంవత్సరాల క్రితం కమ్యూనిటీ బేస్డ్‌ ట్యాంక్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా మంజూరైన పనుల్లో కొన్నింటికి ఇంకా టెండర్లు పిలవకపోవడంపై మంత్రి మండిపడ్డారు. మంజూరైన పనులను మరో రెండు నెలల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. చెరువుల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యుసా అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్‌., ఎస్టీ లు అధికంగా ఆయకట్టుదారులుగా ఉన్న చెరువులకు ప్రాధాన్యతనిచ్చి పనులను ప్రారంభించాలని మంత్రి సూచించారు. వంద ఎకరాలకు తక్కువగా ఆయకట్టు కలగిన 255 చెరువులకు గతంలో రూ.8.13 కోట్లు మంజూరు చేశామని, కొన్ని కోట్ల పనులు పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 ఎకరాలకు పైగా ఆయకట్టు కలిగిన 126 చెరువులకు మరమ్మత్తులు, ఆధునీకరణ, నీటి నిల్వ సామర్ద్యాన్ని పెంచేందుకు రూ. 48 కోట్లు, 100 ఎకరాలకు లోపు ఆయకట్టు కలిగిన 227 చెరువులకు 24 కోట్లు గ్రాంటుగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఈ నిధులు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.రాంరెడ్డి, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు శ్రీరాంరెడ్డి, జి.కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.