|
|
మొక్కల్ని నాటడమే కాదు... వాటిని రక్షించాలి
రంగారెడ్డి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన వనమహోత్సవం - మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒకేరోజు లక్ష మొక్కలు నాటడమనేది ఒక విశిష్ట కార్యక్రమమని అన్నారు. కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా ఆ మొక్కలు మహావృక్షాలుగా రూపాంతరం చెందేవరకు పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం పట్ల నిర్లక్ష్యం వహిస్తే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణకై అటవీ సంపదను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. మన ఇంటిని మనమేరకంగా సంరంక్షించుకుంటామో , మొక్కలను కూడా అదేవిధంగా సంరక్షించి భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 8663 వన సంరక్షణ సమితీలు ఉన్నాయని, ఈ సంరక్షణ సమితులు కేవలం నామ మాత్రంగానే కాకుండా పచ్చదనాన్ని పెంచడంలో చురుకైన పాత్ర పోషించాలని, ఇందుకు ఎవరి ఆదేశాలు అవసరంలేదని, బాద్యతగా గుర్తించి పనిచేయాలని ముఖ్యమంత్రి ఉద్బోదించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు పి.సబితాఇంద్రారెడ్డి , రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గ్రేటర్ మేయర్ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ చాలా ప్రాముఖ్యతగల అంశమని అందరూ గుర్తించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 10 లక్షల మొక్కలు నాటే చారిత్రాత్మాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఒకే రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటి గిన్నీస్ రికార్డు సృష్టించడంతోపాటు ఆ మొక్కల పరిరక్షణకు అవసరమైన ఫెన్సింగ్, నీరు, సిబ్బంది తదితర ఏర్పాట్లు కూడా చేశామని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమరలో స్వచ్చంది సంస్థలు వివిధ విద్యా సంస్థలకు చెందిన చిన్నారులతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటీవ్ ఆఫ్ పారెస్ట్ మధుకర్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
|