న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
కాల్పుల ఘటనపై ప్రజా సంఘాల కన్నెర్ర!

రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరిన హైకోర్టు
అంతర్గత లోపాలపై విచారణ మొదలుపెట్టిన డీజీపీ
ప్రాధమిక నివేదిక ముఖ్యమంత్రికి అందజేత
మరిన్ని వివరాలతో మలి నివేదికకు అధికారుల కసరత్తు
హైదరాబాద్‌, జులై 16 (ఫీచర్స్ ఇండియా): శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ప్రజా సంఘాలు, పౌర హక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కొంత మంది న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన వి.వి.కృష్ణారావు, మరో ఇద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించడమే కాకుండా ఘటనపై పూర్తి వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోంపేటలో లాఠీఛార్జ్‌, పోలీస్ ‌కాల్పుల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని గురువారం హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేయాలని కోర్టుకు విన్నవించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు ప్రస్తుతం సోంపేట పరిస్థితిని ఆరా తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోంపేట కాల్పుల ఘటన తమ పీకల మీదికి రావడంతో పోలీసు అధికారులు అంతర్గత విచారణ మొదలుపెట్టారు. పోలీసులు అత్యుత్సాహమే కాల్పులకు దారి తీసిందని ఆరోపణలు వెల్లువెత్తడం, పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు కనిపిస్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానించడంతో ఉన్నతాధికారులు సంఘటన తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆందోళనకారులు అకస్మాత్తుగా రెచ్చిపోవడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని క్షేత్రస్థాయి అధికారులు ప్రాథమికంగా నిర్ధరించినట్లు చెబుతున్నారు. అయితే అవసరానికి మించి బలగాలను మోహరించడం, కొద్ది రోజుల ముందు నుంచే కవాతు నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆందోళనపై కింది నుంచి ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అంశంపైనా దృష్టి పెట్టారు. విద్యుత్తు కేంద్రం స్థాపనను వ్యతిరేకిస్తూ సోంపేటలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడటంతో కాల్పులు జరగడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. వాస్తవానికి ఆందోళనపై ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులు జరపవద్దని, సంయమనం పాటించాలని జిల్లా పోలీసులకు స్పష్టంగా చెప్పామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే అంతా సర్దుకుంటున్న తరుణంలో ఆందోళనకారులు పోలీసులనే లక్ష్యంగా చేసుకొని రాళ్లు రువ్వారనీ, ఆత్మరక్షణ కోసం పోలీసులు తమ వద్ద ఉన్న పిస్తోలు, రివాల్వర్‌ వంటి చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపారని, మొత్తం 34 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపలేదనీ, ఎదురుదాడికి దిగిన వారిపైనే కాల్పులు జరిపినట్లు నిర్ధరించారు. అసలు బందోబస్తు కోసం వినియోగించిన సిబ్బందికి ఆయుధాలు కూడా ఇవ్వలేదనీ, అత్యవసరమైతే పరిస్థితి అదుపు చేసేందుకు డమ్మీ బుల్లెట్లు మాత్రమే ఇచ్చారన్నది అధికారుల వాదన. అయితే.. ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందడంతో ఈ వాదనకు విలువ లేకుండా పోయింది. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నా.. సంఘటన జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచీ గ్రామాల్లో కవాతు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆందోళన సందర్భంగా అధికారుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. సంఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి, డీజీపీ, నిఘా విభాగాధిపతి ఢిల్లీలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇతర అధికారులు కూడా ఇది మామూలు ఆందోళనే అన్నట్లు తేలిగ్గా తీసుకున్నారు. కాని పరిస్థితి కాల్పుల వరకూ దారి తీసిన తర్వాత ఉలిక్కిపడ్డారు. అసలు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు వారు మీడియాపై ఆధారపడాల్సి వచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేకపోయారు. పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హోంమంత్రి కార్యాలయ సిబ్బంది ప్రయత్నించినప్పుడు 'మీకు ఎంత తెలుసో మాకూ అంతే తెలుసు. మీడియా వార్తలు నమ్మలేం. మాకెవరూ సమాచారం ఇవ్వడం లేదు' అని ఓ అదనపు డీజీ స్థాయి అధికారి అసహాయత వ్యక్తం చేయడం సమన్వయ లేమికి పరాకాష్ఠ. ఈ వ్యవహారాలన్నింటిపైనా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. తాజాగా హైకోర్టు నివేదిక కోరుతూ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అధికారుల్లో కదలిక ఊపందుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్, జిల్లా ఎస్పీ, ఇతర ముఖ్య అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అవసరాన్ని బట్టి సోంపేటలో ఉన్నతాధికారుల బృందం పర్యటించే సూచనలు ఉన్నాయి.