|
|
కర్నూలులో విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
కర్నూలు జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో జరిగిన వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోట గ్రామానికి చెందిన ఓ యువ రైతు పొలం పనుల్లో ఉండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, కురిచేడు మండలం ఎన్‌ఎస్పీ అగ్రహారం గ్రామానికి చెందిన లారీ క్లీనర్ దస్తగిరి లారీ కేబినుకు వైర్లు తగిలి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే... రామళ్లకోట గ్రామానికి చెందిన చంద్రశేఖరరెడ్డి, యశోదమ్మల ఏకైక కుమారుడు మహేష్ (20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి తండ్రితో పాటే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఈ ఏడాది తమకున్న మూడు ఎకరాల పొలంలో పసుపు, ఉల్లి విత్తనాలను విత్తారు.
వాటికి నీరు పెట్టేందుకు మహేష్ ఉదయం పొలానికి వెళ్లాడు. అక్కడ మోటార్ స్విచాన్ చేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పక్క పొలాల వారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. కుమారుడు విద్యుదాఘాతానికి బలయ్యాడని తెలియగానే వారు కుప్పకూలిపోయారు. వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మహేష్ ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
విద్యుదాఘాతానికి గురై ఎన్‌ఎస్పీ అగ్రహారం గ్రామంలో గోస్పాడు చెందిన యువకుడు మృతిచెందాడు. అగ్రహారంలో పనుల నిమిత్తం దర్శి నుంచి పొక్లెయిన్‌ను లారీలో తీసుకొస్తున్నారు. గ్రామ చెరువు కట్టమీదకు రాగానే విద్యుత్ తీగలు వేలాడుతూ ఉన్నాయి.
లారీ క్లీనర్, పొక్లెయిన్ ఆపరేటరైన జి. దస్తగిరి (25) లారీ క్యాబిన్ పట్టుకుని విద్యుత్ తీగలు గమనిస్తూ డ్రైవర్‌కు సూచనలు ఇస్తున్నాడు. ఆ క్రమంలో విద్యుత్ తీగలు లారీ వెనుక ఉన్న పొక్లయిన్‌కు తగిలి విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో అతను విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, దస్తగిరి లారీ క్లీనర్‌గా పనిచేస్తూ పొక్లెయిన్ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు. అతను తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఇద్దరు అమ్మాయిలు. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. మేనకోడలు అశ్వనితో అతనికి రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. వివాహానికి ముహూర్తం నిర్ణయించుకునేందుకు నాలుగు రోజుల క్రితం ఫోన్ చేస్తే రాలేదని మృతుని తండ్రి భోరున విలపించారు.
|
|
|