|
|
అగ్రస్థానానికి అడుగుదూరంలో సైనా
న్యూఢిల్లీ, జులై 15 (ఫీచర్స్ ఇండియా): రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్‌వన్ కావాలన్న తన స్వప్నానికి మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సైనా నెహ్వాల్ తాజాగా తన ర్యాంకును మరింత మెరుగు పరుచుకున్నారు. ఈసారి ఏకంగా రెండవ ర్యాంకు సాధించి, అగ్రస్థానాన్ని అధిష్టించాలన్న తన ఆకాంక్షకు అడుగు దూరంలో నిలిచారు. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళ ర్యాకింగ్స్‌లో చైనా క్రీడాకారిణి ఇవాన్ వాంగ్ మొదటి స్థానంలో నిలువగా, సైనా ఆమె తర్వాతి స్థానం సాధించారు. మూడవ ర్యాంక్‌లో చైనాకు చెందిన జింగ్ వాంగ్ ఉన్నారు.
అత్యంత తక్కువ కాలంలోనే ప్రపంచ రెండవ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని, వరుసగా మూడు టైటిల్ సాధించడంతో తన ర్యాంకు మరింత మెరుగయిందని సైనా సంతోషం వ్యక్తంచేశారు. ర్యాంక్ గురించి ఆలోచించడం కన్నా భారత్‌కు మరిన్ని పతకాలు సాధించి పెట్టడం తన కు ప్రధానమని చెప్పారు. ప్రస్తుత ర్యాంకులో కొనసాగడం అంత సులభం కాదని, దీనికోసం విజయ పరంపరను కొనసాగించాలని ఆమె అన్నారు.
ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడంతో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా అవతరించిన సైనాకు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ శిక్షకుడిగా ఉన్నాడు. గత నెల 20న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా పేరుతెచ్చుకుంది. హర్యానాలోని హిస్సార్లో 1990 మార్చి 17న జన్మించిన సైనా తలిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే. 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది. ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిలో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2009లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది. 2010లో ఆల్ ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది. 2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే.
|
|
|