న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
సోంపేట ఘనటపై దద్దరిల్లిన అసెంబ్లీ!

సచివాలయ ముట్టడికి టీడీపీ యత్నం
నిరవధిక వాయిదాతో ముగిసిన సమావేశాలు
బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
థర్మల్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి రద్దు
ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ చంద్రబాబు
హైదరాబాద్‌, శ్రీకాకుళం, న్యూఢిల్లీ, జులై 15 (ఫీచర్స్ ఇండియా): శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దద్దరిల్లింది. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యతవహించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో చేసేదిలేక పాలకపక్షం సభను నిరవధికంగా వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. సోంపేట కాల్పుల ఘటనపై సభ ప్రారంభంలోనే టీడీపీ పట్టుబట్టింది. అయితే, సమాధానం చెప్పడంలో ప్రభుత్వం తనదైన శైలిని ప్రదర్శించడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించాయి. కాల్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన టీడీపీ సభ్యులు మొదట అసెంబ్లీ గేట్‌-1 ఎదుట బైఠాయించారు. అనంతరం అక్కడినుంచి సచివాలయ ముట్టడి జరుపుతామని ప్రకటించి సభ్యులంతా బయలుదేరారు. రవీంద్రభారతి చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించటంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోంపేట కాల్పుల ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి తిరస్కరించారు. దీంతో సభ్యులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్‌ కొనసాగించారు. సోంపేట ఘటనకు నిరసనగా అసెంబ్లీ రణరంగంగా మారటంతో ఆఖరురోజు సమావేశాల్లో కూడా ప్రయోజనకరమైన చర్చలేం జరగలేదు. విపక్షాలను రోజంతా సభ నుంచి సస్పెండ్‌ చేయటంతో గందరగోళమే మధ్యాహ్నం వరకు కొనసాగింది. అనంతరం మంత్రి ప్రసంగం, బాధితులకు పరిహారం ప్రకటించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదావేయటంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కాగా, పోలీసు కాల్పులకు గురై మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపటంతో నలుగురు మృతి చెందారు. వీరికి ఈ పరిహారం అందజేస్తారు.పోలీసు కాల్పుల్లో మరణించినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని రోశయ్య ప్రకటించారు. లాఠీఛార్జిలో గాయపడినవారికి వైద్యం ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని ఆయన తెలిపారు. టీడీపీ సభ్యులను సభనుంచి ఒకరోజుసాటు సస్పెండ్‌ చేయటంతో వారు బయట ఆందోళనకు దిగారు. మొదట సీఎం ఛాంబర్‌ముందు ధర్నా చేసిన టీడీపీ సభ్యులు అనంతరం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తాళం వేసేందుకు ప్రయత్నించారు. అంతకముందు ఈ ఘటనపై హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్షాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం ఎన్‌సీసీకి కొమ్ముకాసి ప్రజలపై యుద్ధం ప్రకటించిదా? అని తెదేపా సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. సోంపేటలో మూడు వేల పోలీసులను ఎందుకు మోహరించాల్సి వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాల్పులకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌, ఎస్పీని సస్పెండ్‌ చేయాలని, ధర్మానను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. సోంపేట ఘటన మానవ హక్కుల ఉల్లంఘనే అని ప్రజారాజ్యం పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా తయారైందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్కకారులకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థగా మార్చిందని విమర్శించారు. వైఎస్‌ హయాం నుంచి సెజ్‌ల పేరిట వేల ఎకరాలను దారాదత్తం చేశారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గతంలో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే సోంపేట దుర్ఘటనకు దారితీసిందన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 3 వేల మంది పోలీసులతో సోంపేట పరిసర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారని, ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన ఎలా చోటుచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సోంపేట ఘటనపై నిన్న అసెంబ్లీలో నిలదీస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు. ఇదిలావుండగా, సోంపేట ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని, జిల్లా మంత్రి ధర్మాన బాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందుకు మంత్రి ధర్మాన సమాధానం ఇస్తూ శ్రీకాకుళం జిల్లా ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడి ఉందని సరైన ఉద్యోగాలు, బతుకుతెరువు లేక ఎందరో వలస వెళుతుంటారని అన్నారు. జిల్లాలో పరిస్థితి చూసి ప్రజలను ప్రేమించే వ్యక్తిగా, ఓ ప్రజా ప్రతినిధిగా ఎంతో ఆవేదన చెందేవాడినని అన్నారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఏర్పాటును జిల్లా ప్రజల బాగు కోరేవాడిగా తాను సమర్థించానని ఆయన అన్నారు. వలస వెళ్లి అనారోగ్యకర పరిస్థితుల్లో పనిచేస్తూ తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేని దౌర్భాగ్యంనుంచి విముక్తి కలుగుతుందని సంతోషించానని అన్నారు. విపక్షాలకు ప్రజలు బాగు అక్కర్లేదు...ఎలాగైనా అధికారంలోకి రావాలి... అందుకు ఎంతటి నీచానికైనా దిగజారుతారు... అందుకే ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు సృస్టించారు. అందుకు మీరంతా సిగ్గుపడాలి... ఈరోజు కూడా చంద్రబాబు వెళ్లి అక్కడ మరింత హింసను రేపెట్టటం ఇందుకు సాక్ష్యం.... నా రాజీనామా పెద్ద విసయం కాదు... అయితే చేసిందానికి సిగ్గుపడాల్సిన అవసరం మాకు లేదు... మీరే సిగ్గుపడాలి... ప్రజల బాగుకోరి వారి కోసం పరిశ్రమలకు అనుమతి ఇచ్చినందుకు మేం గర్వపడుతున్నాం... అని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంనుంచి బర్తరఫ్‌చేయాలని తెలుగుదేశం శాసనసభ్యులు ముఖ్యమంత్రి రోశయ్య ఛాంబర్‌ ఎదుట థర్నా నిర్వహించారు. అయితే తెలుగుదేశం సభ్యుల డిమాండ్‌ మేరకు తాను ఎవర్ని మంత్రివర్గంనుంచి తొలగించలేనని రోశయ్య వారికి స్పష్టంచేశారు. ఇదిలావుండగా సస్పెండైన తెలుగుదేశం సభ్యులను సభనుంచి బయటకు పంపిన తరువాత శాసనసభప్రత్యక్షప్రసారాలు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యాలయం తెలిపింది. సోంపేట ఘటనపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం తలెత్తటంతో స్పీకర్‌ విపక్షాలను ఒకరోజుపాటు సభనుంచి సస్పెండ్‌ చేశారు. అయినా వారు వెళ్లలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటంతో మార్సల్స్‌తో గెంటించారు. అయినా వారు మళ్లీ వారితో పెనుగులాడి వెనుకకు రావటంతో ఇదంతా టీవీ ప్రసారాల్లో రాకుండా స్పీకర్‌ ప్రత్యక్ష ప్రసారాల కేబుల్‌ను కట్‌ చేశారు. సోంపేట ఘటనపై అసెంబ్లీలో నిరసన తెలియజేసి, సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్ష సభ్యులను స్పీకర్‌ ఒకరోజు సస్పెండ్‌ చేశారు. సోంపేట ఘటనపై పలుమార్లు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభం కాగానే ఈ ఘటనపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుంటూ స్పీకర్‌ పోడియాన్ని విపక్ష సభ్యులు చుట్టుముట్టారు. ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ వారించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో పోడియాన్ని చుట్టుముట్టుని తెదేపా సభ్యులను, భాజపా నేత కిషన్‌రెడ్డిని స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అనంతరం సభ్యులు నినాదాలు చేస్తూ సభను వదిలి వెళ్లారు. సోంపేట ఘటనకు జిల్లా మంత్రి ధర్మాన నైతికబాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై చర్చకు డిమాండ్‌ చేశాయి. అందుకు స్పీకర్‌ అనుమతించలేదు. ఇలాంటి ఘటనకు బాధ్యులైన ప్రభుత్వం సిగ్గుపడాలంటూ టీడీపీ ఆవేశంగా ప్రసంగించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మైకులు విరిచి మరీ బల్లగుద్దారు. పోడియంపైకి మైకులు విసిరారు. దీంతో స్పీకర్‌ విపక్షాలను సస్పెండ్‌ చేశారు. అందుకు మరింత ఆగ్రహించిన వారు పోగాయం వద్దకు దూసుకుని వెళ్లారు. తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. బయటకు వెళ్లమన్నా వారు వినలేదు. మార్షల్స్‌ బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని మళ్లీ పోడియం వద్దకు వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అధికారపక్షసభ్యులు, విపక్షాలు పోటాపోటీగా నినాదాలకు దిగటంతో సభ రణరంగంగా మారింది. సోంపేటలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై అసెంబ్లీలో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం వల్లే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో సుమారు 145 మందికి గాయాలైనట్లు తెలిపారు. 37 మంది పోలీసులు, 6గురు పాత్రికేయులతోపాటు 86 మంది పౌరులకు గాయాలైనట్లు వెల్లడించారు. పోలీసులు 9 ఎంఎం తుపాకీతో కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాగా, సోంపేట థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతిని పర్యావరణ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ రద్దు చేసింది. కోస్తా ప్రాంతంలో సరైన అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ట్రైబ్యునల్‌ సూచించింది. ఈ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై మూడు నెలల కిందట పర్యావరణ అప్పీలేట్‌లో సమత, ఫోరం ఫర్‌ బెటర్‌ విశాఖ, సోంపేట పర్యావరణ పరిరక్షణ కమిటీ సంస్థలు ఫిర్యాదు చేశాయి. జాతీయ పర్యావరణ అనుమతుల పునర్విచారణ సంస్థలో మూడు రోజులుగా వాదనలు కొనసాగిన అనంతరం ఈ విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకుంది. మరోపక్క సోంపేటలో ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణ సమితి సోంపేటలో ఈఉదయం చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాలను పోలీసులు తొలగించారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా ఆందోళనకారులు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా ఉన్నవారి ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. సోంపేటలోని కాంగ్రెస్ నాయకుడు రమణ ఇంటిపై దాడిచేసిన ఆందోళనకారులు ఆయన వాహనాలను, ఫర్నీచరును ధ్వంసం చేశారు.