|
|
పశుసంవర్ధక శాఖ లక్ష్యాలపై సమీక్ష
మెదక్, జులై 14 (ఫీచర్స్ ఇండియా): పశుసంవర్ధక శాఖ నిర్ణయించిన లక్ష్యాన్నిఅందరూ కలసికట్టుగా సాధించాలని మెదక్ జిల్లా కలెక్టర్ యస్.సురేష్‌కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ఆవరతలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో జిల్లాలో గల అసిస్టెంట్ డైరెక్టర్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, వెటర్నరీ డాక్టర్లు, ఎపి డైరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధి, పశుసంవర్ధక శాఖతో పాటు పని చేస్తున్న ఎన్.జి.ఓల ప్రతినిధులు సమావేశమునకు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పశుగణం వివరాలు నూతనంగా సర్వే చేసి సమాచారం సేకరించాలన్నారు. 3.58 లక్షలు పాలు ఇచ్చే ఆవులు, బర్రెలు ఉండగా, సరాసరి దాదాపు 48 వేల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి నమోదు అవుతుందని ఎపి డైరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ప్రతినిధి తెలుపగా ఈ ఉత్పతి ్త సంతృప్తి కరంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానికి దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లా తరువాత మెదక్ జిల్లాకే పాల వ్యాపారానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని పాల ఉత్పత్తి పెంచడం ఎంతో అవసరం ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో గ్రామానికి ఒకటి చొప్పున కేవలం 683 పాల సేకరణ కేంద్రాలు, 5 చిల్లింగ్ సెంటర్లు, 17 బల్క్ కలెక్షన్స్ సెంటర్స్ ఉన్నాయని గుర్తిస్తూ ఇంకా పాలు సేకరించడానికి కేంద్రాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన కోరారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 202 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 75 శాతం సబ్సిడిపై పంపిణీ చేశామని, 4,106 హెక్టార్ల భూమిని సాగులో తీసుకోబడిందని ఆయన తెలిపారు. వచ్చే వేసవి కాలం ప్రారంభానికి మూడు మాసాల ముందే పశు గ్రాసం కొరత లేకుండా, చెరువులు, కుంటల వద్ధ పశుగ్రాసం పెంచడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో కేవల 66 గోపాలమిత్ర సంఘాలున్నాయని వీటిని 100 కు పెంచాలని అధికారులు దృష్టి సారించి ఫలితాలు సాధించాలన్నారు. గ్రామాలలో చదువుకున్న నిరుద్యోగ యువకులను గుర్తించి గోపాలమిత్ర సంఘాలలో చేర్పించాలని అధికారులకు ఆయన సూచించారు. వీరికి డిఆర్ డిఎ కార్యాలయము నుండి కావల్సిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. గోపాలమిత్ర సంఘాల సహాయంతో పశువులకు టీకాలు వేయడం, చికిత్సలు చేయడంలాంటివి లక్ష్యానికి అధిగమించాలన్నారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆసుపత్రులు, పశు వైద్య కేంద్రాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని జాయింట్ డైరెక్టర్ తెలుపగా భవనాల మరమ్మత్తుల కోసం బిఆర్ జిఎఫ్ 12వ ఆర్థిక ఫైనాన్స్ నిధులు కేటాయింపు కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. తమ వైద్య కేంద్రాలలో నిర్ణయించ బడిన సమయాలలో డాక్టర్లు ఖచ్చితంగా ఉండి తీరాలని, లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. జహీరాబాదు మరియు నారాయణఖేడ్ ప్రాంతాలలో పశువులకు చికిత్స నిమిత్తం మొబైల్ యూనిట్లు పనిచేస్తున్నాయని, ఆట్టి యూనిట్లు ప్రజలకు ఎంతో ఉపయోగం పడేలాచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో గల అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న అల్లాన మరియు అల్‌కబీర్ పరిశ్రమలు పశుసంవర్ధక శాఖ చేపట్టే కార్యక్రమాలకు మద్ధత్తు ఇస్తున్నారని అధికారులు తెలుపగా జిల్లాలో గల టీకాల తయారు చేసే పరిశ్రమల నుండి కూడ పశువులకు మేలు జరిగేలా ఏదో విధంగా మద్ధత్తు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అంతకు ముందు జాయింట్ డైరెక్టర్ శాఖ పరమైన తీసుకోబడుతున్న వివిధ కార్యక్రమాలపై పవర్ పైంట్ ప్రజేంటేషన్ ద్వారా క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.వి.లక్ష్మారెడ్డి , ఉప సంచాలకులు డా. విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
|
|
|