న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ప్రాణాలు తీసిన సొరకాయ రసం

న్యూఢిల్లీ: సొరకాయ రసం తాగితే ఎవరైనా చనిపోతారా? ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అవుననే అంటున్నారు. తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 60 ఏళ్ల శాస్త్రవేత్త పరగడుపునే సొరకాయ, కాకరకాయ రసం తాగిన తర్వాత మరణించారని, ఆయన భార్య రక్తం కక్కుకుని, తీవ్ర డయేరియాకు గురై.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని రాక్‌లాండ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎం.పి. శర్మ తెలిపారు. ఆయన గతంలో ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. దోసకాయ కుటుంబానికి చెందిన కూరగాయలు, పళ్లలో హానికరమైన విషపదార్థాలు ఉంటాయని.. అందువల్లే అవి చేదుగా ఉంటాయని శర్మ తెలిపారు. అలా చేదుగా ఉండే రసాలను తాగకపోవడమే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చిలో సీనియర్ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న తన మామ సుశీల్ కుమార్.. గత నాలుగేళ్ల నుంచి సొరకాయ రసం తాగుతున్నారని ఆయన అల్లుడు అమిత్ సూద్ తెలిపారు. కానీ 15 రోజుల క్రితం తాగినప్పుడు అది కొంచెం చేదుగా ఉందని ఆయన చెప్పారన్నారు. ఆయన భార్య అసలు రసం తాగలేకపోవడం ఆమెను కాపాడింది. రసం తాగిన వెంటనే ఇద్దరూ రక్తం కక్కుకున్నారు. కుమార్ మాత్రం చనిపోయారు. ఇద్దరినీ రాక్‌లాండ్ ఆస్పత్రికి తరలించినా.. తీసుకొచ్చేసరికే కుమార్ మరణించారని డాక్టర్ ఎం.పి. శర్మ చెప్పారు. కుమార్ భార్యకు తాము ఎండోస్కొపీ చేయగా.. ఆమె ఉదరం మొత్తం కాలిపోయినట్లు ఉందని ఆయన వివరించారు. ఉదరంలో అల్సర్లున్నాయయని, 'టెట్రాసైక్లిక్ ట్రైటర్‌పెనాయిడ్ కుకుర్బిటాసిన్స్' అనే విషపదార్థం వల్లే అవి ఏర్పడ్డాయని శర్మ తెలిపారు.

ఇది దోసకాయ కుటుంబానికి చెందిన కూరగాయలు, పళ్లలో ఉంటుందని.. దీనివల్లే వాటికి చేదు రుచి వస్తుందని వివరించారు. రెండుమూడు రోజుల పాటు ఆమెకు ఫ్లూయిడ్లు ఇచ్చి, ఉదరాన్ని శుభ్రం చేసిన తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. పండ్లలోని చేదు భాగాలను ఎప్పటినుంచో మనవాళ్లు కోసి పక్కన పారేయడం అలవాటనేనని.. కూరగాయలైతే ఉడికించిన తర్వాత ఆ విష పదార్థాలు నాశనమైపోతాయని తెలిపారు. కానీ, పండ్ల రసాలు మాత్రం అలా కాదని.. ముఖ్యంగా మధుమేహం, ఇతర సమస్యలతో బాధపడేవారు కూరగాయలు/పండ్లలోని చేదు భాగాలను వేరు చేయకుండానే రసం తీసుకోవడం ప్రమాదకరమని అన్నారు. గతంలో డెహ్రాడూన్‌లోని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్‌లోను, అహ్మదాబాద్‌లోను కూడా ఇలాంటి కేసులు బయటపడినట్లు వైద్యులు వివరించారు.