న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
జనాభా నియంత్రణపైనే ఆధారపడ్డ దేశభవిష్యత్తు

ఏలూరు, జులై 11 (ఫీచర్స్ ఇండియా): జనాభా నియంత్రణపైనే దేశభవిష్యత్తు ఆదారపడి ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎ. వాణీ ప్రసాద్‌ చెప్పారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ఏలూరు ఐఏడిపి హాల్లో ఆదివారం జరిగిన సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశ విస్త్రీర్ణం కేవలం 2.5 శాతం మాత్రమేనని అయితే జనాభా మాత్రం18 శాతం ఉన్నారని దీనివల్ల భూమిపై భారమే కాకుండా పర్యావరణాన్నికూడా తీవ్ర విఘాతం కలిగిస్తుందని చెప్పారు.

ప్రపంచ జనాభాలో చైనా అగ్రస్థానంలో నిలవగా భారతదేశం ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నదని కలెక్టరు చెప్పారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నా ప్రజా అవసరాలు తీర్చాలన్నా జనాభా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వాణీ ప్రసాద్‌ చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్య పద్దతుల్లో జనాభా నియంత్రణ పద్దతులను అమలు చేయడం జరుగుతుందని కాలక్రమేణా ప్రజల్లో వచ్చిన చైతన్య ఫలితంగా నేడు జనాభా పెరగుదల ఉన్నప్పటికి ఆశించిన ఫలితాలు లభిస్తున్నాయని కలెక్టరు చెప్పారు.

ప్రజా భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని జిల్లాలో జనాభా నియంత్రణ కార్యక్రమం మరింత సమవర్థవంతంగా నిర్వహించి జనాభా పెరగుదలను అరికట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఫలితంగా జనాభా నియంత్రణతో పాటు శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ మరణాలు తగ్గాయన్నారు. పిల్లలను కనడంలో బార్యభర్తలు తప్పని సరిగా బిడ్డకు బిడ్డకు వ్యవధి 3 నుండి 5 సంవత్సరాలు పాటిస్తే ఆ పిల్లలు ఆరోగ్య వంతులుగా ఉంటారని కలెక్టరు చెప్పారు.

భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణలో ఒక పటిష్టమైన ప్రణాళిక అవసరమని ప్రతి పౌరుడు జనాభా లెక్కలో తప్పనిసరిగా నమోదు కావాలని అటువంటప్పుడు వారి కనీస అవసరాలైన విద్య, వైద్య, ఆరోగ్య వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సఫలీ కృతమౌతుందని ఆమె చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయండంలో జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచిన లక్కవరం పిహెచ్‌సి డాక్టర్ వజ్రకిరణ్‌ను కలెక్టరు అభినందించారు.

లక్కవరం పిహెచ్‌సిలో గత ఏడాది 960 ట్యుబెక్టమీ, 100 వ్యాసక్టమీ ఆపరేషన్లు నిర్వహించామని 400 వరకు కాన్పులు నిర్వహించినట్లు డాక్టర్ వజ్రకిరణ్‌ చెప్పారు. నగర మేయర్‌ తాడిగడప రామారావు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు.

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల ప్రతిభా పురస్కారాలు
లక్కవరం, నల్లజర్ల, తూర్పుతాళ్ళు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతిభా పురస్కారాలను కలెక్టరు అందజేశారు. ఆయా పి.హెచ్‌.సిలు జిల్లాలోనే మిగిలిన ఆరోగ్య కేంద్రాలతో పోల్చుకుంటే కాన్పుల నిర్వహాణలో కూడా ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ పనితీరు కనపరచిన యండగండి పిహెచ్‌సి వైద్యాధికారి, డాక్టర్ బి. దుర్గాప్రసాద్‌, తణుకు పి.పి.యూనిట్‌. వైద్యాధికారి డాక్టర్ సత్యవతి, చేబ్రోలు పి.హెచ్‌.సి. వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్‌లకు అవార్డులు అందజేశారు.

అలాగే వేసెక్టమి చికిత్సల నిర్వహాణలో ఉత్తమ పనితీరు కనపరచిన పిహెచ్‌సి. పెనుగొండ వైద్యాధికారి డాక్టర్ యం. వెంకటేశ్వరరావు, మేడపాడు పిహెచ్‌సి. వైద్యాధికారి డాక్టర్ పి. శ్రీధర్‌లతో పాటు కాన్పుల నిర్వహనలో ఉత్తమ పనితీరు కనపరచిన దేవరపల్లి పిహెచ్‌సి స్టాఫ్‌నర్సు అనూషా, భీమడోలు స్టాప్‌నర్సు పి. జాన్సీ, కామవరపుకోట స్టాప్‌ నర్సు మేరీ సునీతలకు కూడా అవార్డులు అందజేసారు. గిరిజన ప్రాంతంలో ఉత్తమ వైద్యాధికారిగా వంజరం పిహెచ్‌సికి చెందిన డాక్టర్ రాజేష్‌కృష్ణ, ఆశా వర్కర్లు ఏ.ప్రభావతి, ఎన్‌.పాప, కనకలకు అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలోఇన్‌ఛార్జి డిఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ కళాధర్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్ ప్రసాదబాబు తదితరులు పాల్గొన్నారు.