|
|
జనాభా నియంత్రణలో పశ్చిమకు నాలుగో స్థానం
ఏలూరు, జులై 11 (ఫీచర్స్ ఇండియా): జనాభా నియంత్రణలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి ప్రధమ స్థానంలో నిలవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషుబాబు కోరారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద ఆదివారం ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా శేషుబాబు మాట్లాడుతూ 1951 లో 17 లక్షలు ఉన్న జనాభా గత 60 సంవత్సరాల్లో అధనంగా 25 లక్షలు మంది పెరిగారని ప్రస్తుతం జిల్లా జనాభా 42 లక్షలు దాటిందని చెప్పారు. దేశంలో ఒక రోజలో 76వేల 211 మంది జన్మిస్తుంటే రాష్ట్రంలో 4వేల 351 మంది పుడుతున్నారని అదే ఒక గంటలో దేశంలో 3,175 జన్మిస్తే రాష్ట్రంలో 181 మంది పుడుతున్నారని,ప్రతి నిమిషానికి దేశంలో 53 మంది, రాష్ట్రంలో 3గురు చొప్పున పుడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా నియంత్రణ ఆషామాషీ వ్యవహారం కాదని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి జనభా నియంత్రణకు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
అధిక జనాభా అనేక అనర్థాలకు మూలమని దేశ ఆర్థిక అభివద్దికి జనాభా పెరుగుదల తీవ్ర ప్రతిబంధకమని శేషుబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని, పట్టణాల్లో జనాభా నియంత్రణను గుర్తించి ప్రజలు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని పల్లెల్లో కూడా ప్రజలు అపరమత్తమై జనాభా నియంత్రణకు సహకరించకపోతే ఎన్ని దశాభ్దాలైనా ఆశించిన ప్రగతి సాధ్యం కాదని చెప్పారు.
21 సంవత్సరాలు నిండిన తరువాత మాత్రమే పిల్లలకు వివాహం జరిపేలా చర్యలు తీసుకోవాలని చిన్నవయస్సులో పెళ్ళిళ్లు చేయడం వల్ల శిశుమరణాలు అధికమవుతున్నాయని అంతే కాకుండా గర్భీణీస్త్రీలు కాన్పు సమయంలో మరణాలకు గురౌతున్నారని ఆయన చెప్పారు. జనాభా పెరుగుదల వల్ల సమాజంలో విద్య, ఆరోగ్య వంటి మొదలగు మౌలిక సదుపాయాల కల్పనకు త్రీవ్ర ఆటంకంగా మారిందని, ప్రజలు వాస్తవాన్ని గుర్తించి ఒకరితరువాత విధిగా కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ కళాధర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రసాదబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్‌అండ్‌బి ఆఫీసు మీదుగా ఫైర్‌స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా ఐఏడిపి హాల్‌కు చేరుకుంది.
|
|
|