|
|
జనాభా నియంత్రణకు పకడ్బంధీ చర్యలు
* ప్రపంచ జనాభా దినోత్సవ సభలో విజయనగరం జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య
విజయనగరం, జులై 11 (ఫీచర్స్ ఇండియా): జనాభా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టరు యం. వీరబ్రహ్మయ్య అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్థానిక ఆర్.టి.సి కాంప్లెక్సు వద్ద నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు నిర్వహించబడిన ర్యాలీని కలక్టరు జెండా వూపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ నర్శింగ్ స్కూళ్ల విద్యార్దులు పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం సమావేశ భవనంలో సమావేశం నిర్వహించ బడింది. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ ఉత్తమ వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల నుండి గుర్తింపు, గౌరవం పొందే విధంగా వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. వైద్య సేవలు అందించడంలో వైద్యులకు, సిబ్బందికి కూడా పాలనా పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తామని కలక్టరు చెప్పారు. ఏ సమస్యలున్న తెలియజేయాలని కోరారు.
తల్లి, బిడ్డ క్షేమాన్ని కాంక్షిస్తూ అందరూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రశూతి సౌకర్యం పొందేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే బిడ్డల క్షేమం కోరుతూ శత శాతం టీకా కార్యక్రమం చేయాలని, పూర్తి లక్ష్యాలను సాధించాలన్నారు. గత సంవత్సరం జిల్లాకు బెస్టు ఆల్ రౌండు ఫెర్ ఫార్మెన్స్ అవార్డు రావడం చాలా సంతోషదాయకమన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నానని కలక్టరు చెప్పారు. 2010-11 సంవత్సరములో కూడా ఇదే విధమైన స్పూర్తితో పనిచేసి జిల్లాకు అవార్డు తీసుకురావాలని కోరారు.
జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రతీ ఒక్కరి నమోదు - ఉత్తమ సేవల ప్రణాళికకు నాంధీ అనే నినాదంతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. కుటుంబ నియంత్రణ ఆవస్యకతను 1938వ సంవత్సరములో మైసూరు రాజు గుర్తించడం జరిగిందన్నారు. 1951వ సంవత్సరము నుండి భారతదేశంలో కుటుంబ నియంత్రణా కార్యక్రమం ప్రధాన అంశంగా ప్రారంభమైందన్నారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా మొదటి స్థానంలో వుండగా భారతదేశానికి రెండవ స్థానమన్నారు. జనాభాను నియంత్రించుకున్ననాడే చక్కని ప్రణాళికతో దేశం ముందుకు సాగుతుందన్నారు. ఇందుకు గాను మాతా శిశు మరణాల రేటును తగ్గించుకోవలసి వుందన్నారు. పురుషులు వేసక్టమీ ఆపరేషన్లు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషను అధికారి డాక్టరు వరలక్ష్మి మాట్లాడుతూ 7 ప్రాణాంతక వ్యాధుల నుండి పిల్లలను రక్షించేందుకు టీకా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తున్నామని చెప్పారు.
జిల్లా పబ్లిక్ హెల్త్ నర్శింగు అధికారి జ్యోతి మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషను ద్వారా కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఆరోగ్య విషయాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. సభానంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలకు అందించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు, నర్శులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ, అంగన్వాడి కార్యకర్తలకు జిల్లా కలక్టరు చేతుల మీదుగా అవార్డుల ప్రధానం చేసారు. అలాగే వ్యాస రచన, వక్తృత్వం పోటీలలో విజేతలైన వారికి కూడా బహుమతి ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్శింగ్, తిరుమల, వెంకటపద్మ, భాష్యం నర్శింగ్ స్కూళ్ల విద్యార్దులు పాల్గొన్నారు.
|
|
|