|
|
'పాల్' కొనుగోలుకు స్వానియర్డ్‌ల ఆసక్తి
(ఫీచర్స్ ఇండియా, న్యూఢిల్లీ)
పాకశాస్త్ర నిపుణుల వార్షిక వేడుకకు ఒక చిహ్నం (మస్కట్)గా ఉపయోగించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆక్టోపస్ 'పాల్'ను కొనుగోలు చేయడానికి స్పెయిన్ వాణిజ్యవేత్తలు 30 వేల యూరోలు (దాదాపు 38 వేల డాలర్లు - సుమారు రూ. 17.67 లక్షలు) ఇవ్వజూపినట్లు మీడియా వార్తల ద్వారా తెలియవచ్చింది. ఏటా ఆగస్టులో వాయవ్య స్పెయిన్‌లో ఓరెన్స్ సమీపంలోని చిన్న గ్రామం కార్బలినోలో జరిగే ఈ ఉత్సవంలో స్క్విడ్ ప్రత్యేక వంటకాలపై దృష్టి కేంద్రీకరిస్తుంటారు. పాల్‌ను తమ ప్రాంతానికి తీసుకురావాలన్న ఆలోచన మేయర్ కార్లోస్ మోంటెస్‌కు వచ్చింది.
పాల్ ద్వారా పర్యాటకులను ఆకర్షించ వచ్చని మేయర్ ఆశ. జర్మనీ ఒబర్‌హాసెన్‌లోని సీ లైఫ్ అక్వేరియం వాసి అయిన అష్టపాది 'పాల్' డక్షిణాఫ్రికాలో 2010 ప్రపంచ కప్ సాకర్ టోర్నీలో మ్యాచ్‌ల విజేతలను కచ్చితంగా సూచించడంతో ప్రపంచంలో అందరి దృష్టి పాల్‌పై పడిన విషయం విదితమే. 14 వేల జనాభా గల కార్బలినోలోని వ్యాపార సంస్థలు పాల్ కోసం 30 వేల యూరోలను సమీకరించాయి. 'పాల్‌ను తినాలన్నది మా అభిమతం కాదు' అని గ్రామంలో చేపల వ్యాపారం చేసుకొనే మాన్యూల్ పాజో చెప్పారు.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై ఆ ఆక్టోపస్ జోస్యం చెప్పడం కొనసాగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. పాల్ అమ్మకానికి ఒబర్‌హాసెన్ అక్వేరియం నిరాకరించిన పక్షంలో ఆగస్టు 8న ఉత్సవం కోసం కనీసం బాడుగగానైనా పాల్‌ను తీసుకురావాలని వ్యాపారులు అనుకుంటున్నారు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో జర్మనీపై స్పెయిన్ విజయం సాధిస్తుందని సరిగ్గా సూచించిన తరువాత 'పాల్'పై‚ స్పెయిన్‌లో మీడియా దృష్టిపడింది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై స్పెయిన్ విజయం సాధిస్తుందని ఆ ఆక్టోపస్ జోస్యం చెప్పింది. ఇదే జరిగినట్లయితే స్పెయిన్‌కు ఇది తొలి ప్రపంచ కప్ అవుతుంది.
|
|
|