న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
మహిళా, శిశు సమస్యలను గుర్తించాలి

విశాఖపట్నం, జులై 8 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో నిరుపేద మహిళలు, బాలల రక్షణ, సంక్షేమానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ముందుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని కలక్టరు, జిల్లా మహిళా శిశు రక్షణ సాధికారత కమిటి అధ్యక్షులు జె.శ్యామలరావు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కలక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారిని ఆదుకుని, గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం సహాయ పడుతుందని వారికి తెలియజేయాలన్నారు.

వారి హక్కులు, రక్షణ చట్టాలను గూర్చి వారికి అవగాహన కల్పించాలన్నారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు, స్వచ్ఛంధ సంస్థలు, సేవా కమిటీలను గూర్చి తెలియక పోవడం మూలంగానే పిల్లలు బాలకార్మికులుగా, నేరస్థులుగా మారడం, స్త్రీలు తాము యాచకులులుగా మారడమే కాక, వారి పిల్లలను కూడా యాచకులుగా తయారు చేస్తున్నారన్నారు. కాబట్టి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలకార్మిక, కార్మిక శాఖలు, వికలాంగ, వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్‌ కులాలు, మైనారిటీ సంక్షేమ శాఖాధికారులు, పోలీసు, గ్రామాణాభివృద్దిశాఖల అధికార్లు, స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులు పై సమస్యలను మూలాల నుండి గుర్తించాలన్నారు.

తరువాత సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. అదనపు జాయంట్‌ కలక్టరు ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ సంబంధిత శాఖల ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కలసి సమస్యలను తెలుసుకొని, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసేటప్పుడు కూడా అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

14 సంవత్సరాల వరకు బాల బాలికలకు బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుందని, 14 నుండి 18 సం.ల మధ్య వయసు వారి సంక్షేమం గూర్చి ఆలోచన చేయాలన్నారు. స్త్రీ శిశు సంక్షేమ కమిటి అధ్యక్షులు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు తాను రూపొందించిన సమగ్ర శిశు రక్షణ పథకం కార్యాచరణ ప్రణాళికను పవర్‌ పాయంట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ జువనల్‌ హోం లో వున్న బాల నేరస్తులలో ఆశక్తి, ఉత్సాహం వున్న వారిని గుర్తించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా చదివిస్తున్నట్లు సంస్థ ప్రాజెక్టు డైరక్టర్‌ కామేశ్వరమ్మ తెలిపారు.

అనకాపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ నాగేశ్వరి తమ శాఖ పరిశీలించిన మహిళా సమస్యలను గూర్చి వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటి కమిషనర్‌ ఛైల్డ్‌ లేబర్‌ ఆర్‌.శ్రీనివాసరావు, బిసి సంక్షేమాధికారి భీమశంకరరావు, వికలాంగుల సంక్షేమాధికారి వివియస్‌ యస్‌ ఎన్‌ మూర్తి, డిఎల్‌ ఎస్‌ఎ సెక్రటరీ రమాదేవి, షాబుద్దీన్‌, రీడ్స్‌, పిఎస్‌ఓ స్వచ్ఛద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికార్లు పాల్గోన్నారు.