న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
స్వైన్‌ ఫ్లూ నివారణకు సహకరించండి

విశాఖపట్నం: జిల్లాలో స్వైన్‌ ఫ్లూ, ఇతర వ్యాధుల నివారణకు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రక్రియకు ప్రైవేట్‌ వైద్యులు, నర్సింగ్‌ హోంలు సహకారం అందించాలని జిల్లా కలక్టరు జె.శ్యామలరావు కోరారు. శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, లాబ్‌ టెక్నీషిన్స్‌కు నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరిపై వున్నదన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న వైద్య సేవలు ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంల సహకారం తోనే పూర్తి ఫలితాలిస్తాయని కలక్టరు పేర్కొన్నారు. కాబట్టి వారు తమ పూర్తి సహాయ సహకారాలు నిబద్దతతో అందించాలన్నారు. రోగికి తక్షణ చికిత్స చేయడం, వీలైనంత త్వరగా పూర్తి స్వస్థత పొందే విధంగా వైద్యసేవలు అందించడం చట్టపరంగా, నైతికంగా వైద్యుల, వైద్యశాలల బాధ్యత అని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆదేశాలననుసరించి ఉత్తమ సేవలు, సహకారం అందించిన వైద్యులకు, వైద్యాలయాలకు ప్రభుత్వ పరంగా వారికి రావలసిన సహాయానికై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించక, లోప భూయిస్టమయిన వైద్య సేవలు చేసే వైద్యులు, వైద్యాలయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ననుసరించి వైద్య సేవల కల్పనకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారావు మాట్లాడుతూ స్వైన్‌ ఫ్లూ నివారణలో ప్రైవేట్‌ నర్సిగ్‌ హోం లు కీలక పాత్ర పోషించాలన్నారు.

తమ వద్దకు వచ్చిన రోగుల శాంపిల్స్‌ ను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిచాలని, వాటిని ఉచితంగా పరీక్షించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హెచ్‌1ఎన్‌1 లక్షణాలు, ఏ పరిస్థతులలో వ్యాధి వచ్చే అవకాశం వున్నది, వ్యాధివ్యాప్తిజరిగే విధానం, నివారణకు, వ్యాధి సోకకుండా వుండేందుకు తీసుకోవలసిన చర్యలను గూర్చి అసోషియేట్‌ ప్రోఫెసర్‌ డాక్టర్‌ ఎ.ప్రేమ్‌ కుమార్‌ పవర్‌ పాయంట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, స్వైన్‌ ఫ్లూ ప్రత్యేకాధికారి డాక్టర్‌ దేవి తదితరులు పాల్గొన్నారు.